SHARMILA: వైఎస్ కుటుంబంలో చీలిక జగనన్న వల్లే
వైఎస్సార్ కుటుంబంలో చీలిక చేతులారా జగన్ చేసుకున్నదే అని ఆంధ్రప్రదేశ్ పీసీసీఅధ్యక్షురాలు.... షర్మిల స్పష్టంచేశారు. దీనికి సాక్ష్యం దేవుడు, తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులని షర్మిల చెప్పారు. తిరుపతిలో ఎడ్యుకేషన్ సమ్మిట్ లో.. జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఎదురుదాడికి దిగారు. వైసీపీ కష్టాల్లో ఉంటే నిస్వార్థంగా ఎండనకా వాననకా నెలల తరబడి పాదయాత్రచేసి జగన్ ను గెలిపించానని షర్మిల అన్నారు. సీఎం అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారని తనకు అన్యాయం చేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యాలు చేశారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా రాష్ట్రానికి మేలు చేస్తే చాలనుకున్నానని.. మంచి ముఖ్యమంత్రి అనిపించుకుని వైఎ్స్‌కు పేరు తెస్తే చాలనుకున్నానని షర్మిల అన్నారు. కానీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను జగన్ ముంచేశాడని షర్మిల మండిపడ్డారు.
బీజేపీకి వైసీపీని, ఎంపీలను, ఎమ్మెల్యేలను, రాష్ట్రాన్ని, ప్రజలను కూడా బానిసలుగా చేసేశాడని. పూర్తిగా నియంతలా మారిపోయాడని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. "పెద్దపెద్ద కోటలు కట్టుకుని అందులోనే ఉండిపోయాడు. ప్రజలను కలవడమే మానేశాడు. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎంను కలిసే స్వేచ్ఛే లేకుండా చేసేశాడు. వైఎస్ ప్రజల మనిషి అయితే జగన్ ప్రజలకు దూరంగా మెలిగే వ్యక్తి’" అని నిప్పులు చెరిగారు. వైఎస్ వారసులమని చెప్పుకొంటే సరిపోదని, పాలనలోనూ ఆయన కనిపించాలని.. వీరిద్దరి పాలనలో భూమికి, ఆకాశానికి, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా చీల్చిందని జగన్ ఇటీవల పెద్దపెద్ద మాటలు మాట్లాడాడని.. రాష్ట్రం అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉండడానికి ఆయనే కారణమని ధ్వజమెత్తారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం అప్పుడున్న టీడీపీ ప్రభుత్వాన్ని రోజూ ప్రశ్నించారని షర్మిల గుర్తు చేశారు. "మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎందుకు రాదన్నారు. కానీ సీఎం అయ్యాక ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదు. బీజేపీకి బానిసైపోయాడు. పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా నిలదీయలేదు. రాజధానికి డబ్బులు ఇవ్వకపోయినా అడగలేదు. 3రాజధానులన్నారు. కానీ రాజధానే లేకుండాపోయింది. జగన్ పాలనలో ఎంతోమంది రైతులు వ్యవసాయం మానేశారు. వైఎస్ పేదింటి బిడ్డలను కడుపులో పెట్టి చూసుకున్నారు. జగన్ పాలనలో పేద బిడ్డల పెద్ద చదువులకు భరోసా ఉందా" అని షర్మిల ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. ఉద్యోగం వస్తుందన్న భరోసా లేదు. పరిశ్రమలు లేవు. చివరకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లేవు. వైఎస్ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్‌లో నేను ఎప్పుడూ చేరకపోయేదాన్ని. కానీ రాహుల్, సోనియాగాంధీతో మాట్లాడాక నమ్మకం కలిగింది. వైఎ్‌స్‌ను ఇంతలా అభిమానిస్తూ నెత్తిన పెట్టుకుంటున్నారన.. ఆయనంటే వారికి గుండెలనిండా అభిమానం ఉందని తెలిసింది. వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబం పై నమోదైన కేసులగురించి సోనియా మాట్లాడుతూ.. రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి నేనంత హాని చేస్తానా అని అన్నారు.
మరోవైపు సీఎం జగన్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలే, ఇప్పుడు షర్మిల చేస్తోందని.... ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. షర్మిల మాటలు, వ్యవహారశైలి చూస్తుంటే..... జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 27న భీమిలిలో జరగనున్న వైకాపా బహిరంగసభ ఏర్పాట్లను... వైవీ సుబ్బారెడ్డితో కలిసి బొత్స పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని....... సీఎం జగన్ కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com