SHARMILA: రోజాది జబర్దస్త్‌ దోపిడీ

SHARMILA: రోజాది జబర్దస్త్‌ దోపిడీ
X
నగరిలో ఉన్నది నలుగురు మంత్రులు.... నియంత జగన్‌రెడ్డిని అధికారం నుంచి దింపుతానని షర్మిల ప్రతిన

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజాపై నిప్పులు చెరిగారు. తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. మంత్రి రోజా నియోజకవర్గంలో జబర్దస్త్ దోపిడీ అని, రోజా కుటుంబం వందల కోట్లు దోచుకుందని ఆరోపించారు. నగరిలో ఒకరు కాదు నలుగురు మంత్రులు ఉన్నారని ప్రజలు చెబుతున్నారని... రోజా ఓ మంత్రి, ఆమె భర్త ఓ మంత్రి, ఆమె అన్నలు ఇద్దరు కూడా మంత్రులేనంటూ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. నగరిలో రోజా జబర్దస్త్ దోపిడీకి పాల్పడుతున్నారని, గ్రావెల్స్ వదలరు, చెరువులను, ఇసుక కూడా వదలరని ఆరోపించారు. హౌసింగ్ కు సంబంధించి ఇళ్ల నిర్మాణంలోనే వందల కోట్ల సంపాదించుకున్నారంటూ రోజాపై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. వెంచర్లలో వీరికి కప్పం కట్టాలని, ఎటు చూసినా అవినీతేనని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టానని రోజా అంటోందని... గతంలో ఆమె టీడీపీలో ఉన్నప్పుడు ఐరన్ లెగ్ గా ఫేమస్ కాదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతగా ఉన్నప్పుడు రోజా.. వైఎస్సార్ పై చవకబారు కామెంట్లు చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్ ను పంచ ఊడదీసి కొడతానంటూ అంత గొప్ప మనసున్న నేతపై దారుణమైన కామెంట్లు చేసిన రోజా.. ఇప్పుడు జగన్ పార్టీలో ఉందన్నారు.


మణిపూర్ లో క్రైస్తవులకు అన్యాయం జరిగితే, క్రైస్తవులు అయి ఉండి వైసీపీ వారికి అండగా నిలవలేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశామని, కాంగ్రెస్ ఉన్నంతవరకు తమ పార్టీ బతికే ఉంటుందన్నారు. పుట్టింట్లో అన్యాయం జరుగుతోందని, ఏపీకి రావాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో నియంతను గద్దె దింపాను, ఇప్పుడు ఏపీలో నియంతను గద్దె దింపడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.

వైసీపీ నేతలతో నీతులు చెప్పించుకునే పరిస్థితులో తాను లేనన్నారు. మహిళా మంత్రి అయి ఉండి రోజా నగరి నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్నారు. వైఎస్సార్ ఇచ్చిన వాటిని కూడా వాడుకోవడం చేతకాలేదని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ ధర ఎంత ఉంది, ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉందని.. ఒక్క ఛాన్స్ అంటే ఇదేనా అని నిప్పులు చెరిగారు. మహిళలకు కూడా భద్రత కల్పించలేదు, వారికి తగిన ఇప్పించలేకపోయారని మంత్రి రోజాపై మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో ఇచ్చే వేతనాలు అడిగితే ఇవ్వడం చేతకాని సర్కార్ వైసీపీ ప్రభుత్వమని.. రోజా నోరు అదుపులో పెట్టుకుని కూర్చుంటే మంచిదని హెచ్చరించారు.

Tags

Next Story