YSRCP : కర్నూలు ప్రజలను శాపంగా మారిన వైసీపీ అవినీతి..

కర్నూలు జిల్లా ప్రజలకు వైసీపీ చేసిన అవినీతితో నానా ఇబ్బందులు వస్తున్నాయి. వైసీపీ హయాంలో ఈ జిల్లాలో 30 కి.మీ మేర రోడ్ల కోసం రూ.60 కోట్లు కేటాయించారు. కానీ ఏం లాభం.. ఆదోనీ, ఆలూరు వైసీపీ నేతలకు పంపకాల్లో తేడాలు వచ్చి కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యేలు గొడవలు పెట్టుకున్నారు. దీంతో వాళ్ల బాధలు భరించలేక కాంట్రాక్టర్లు రోడ్లు వేయకుండానే వెళ్లిపోయారు. అప్పటి నుంచి రోడ్లు వేయకుండా అలాగే ఉండటంతో ప్రజలకు నానా ఇబ్బందులు వస్తున్నాయి. అసలు రోడ్డు ఎక్కాలంటేనే వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ధనపురం నుంచి హోలగుంత వరకు రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి. ఆదోనీ నియోజకవర్గం ధనాపుర నుంచి ఆలూరు నియోజకవర్గం హోలగుంత వరకు ఉన్న ఏడు గ్రామాలకు కనీసం అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది.
ఇక్కడి నుంచి కర్ణాటకలోని బళ్లారికి నిత్యం గ్రామాల ప్రజలు వెళ్తూ ఉంటారు. ఈ మార్గంలో మోకాలిలోతు వరకు గుంతలు ఉన్నాయి. రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు కూడా తిరగట్లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో స్థానిక ప్రజలతో పాటు ఆటో డ్రైవర్లు రంగంలోకి దిగారు. ఆదోనీ సబ్ కలెక్టరేట్ ముందు వారం రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు. ఈ చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న గర్భిణులకు అయితే దినదిన గండంలాగే ఉంది పరిస్థితి. ఎమర్జెన్సీ టైమ్ లో అంబులెన్స్ కూడా రాక నానా అవస్థలు పడుతున్నారు. ఇదంతా వైసీపీ నేతలు చేసిన పంపకాల గొడవల వల్లే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ పార్టీ చేసిన తప్పిదం నేడు తమకు శాపంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఆదోనీ ఎమ్మెల్యేగా బీజేపీ నేత పార్థసారథి ఉన్నారు. ఆయన ఈ రోడ్ల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నారా లోకేష్ ను కలిసి రీసెంట్ గానే ఆయన వినతి పత్రం ఇచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం వల్లే ఈ రోడ్ల సమస్య తొలగిపోతుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. కూటమి వచ్చాక చాలా ఊర్లలో రోడ్లు వేస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా కొత్త రోడ్లు చూడని గ్రామాలకు.. ఇప్పుడు రోడ్లు వెళ్తున్నాయి. త్వరలోనే ఈ ఏడు గ్రామాల సమస్య కూడా తీరిపోతుందనే నమ్మకంతో వారంతా ఉన్నారు. వైసీపీ చేసిన తప్పులను కూటమి సరిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు సమాచారం అందుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com