TDP: తెలుగుదేశంలోకి కొనసాగుతున్న చేరికలు

TDP: తెలుగుదేశంలోకి కొనసాగుతున్న చేరికలు
ఫ్యాన్​ను వీడి సైకిల్ ఎక్కుతున్న నేతలు

వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు జోరందుకున్నాయి. వైకాపా నేతలు, ZPTCలు, సర్పంచ్‌లు... ఆ పార్టీని వీడి సైకిలెక్కుతున్నారు. చంద్రబాబు సమక్షంలో భీమిలి, జీడీ నెల్లూరు కీలక నేతలు చేరగా.... నెల్లూరు గ్రామీణంలో తెదేపా కండువా కప్పుకున్నారు. గుడివాడలోనూ 100 మంది యువత వైకాపాను వీడి.... తెలుగుదేశం గూటికి చేరారు. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోనూ భారీగా చేరికలు జరిగాయి.

భీమిలి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల వైకాపా నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. V.M.R.D.A ఛైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మలతోపాటు విశాఖ జిల్లా చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు దుక్క కృష్ణాయాదవ్.. వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం, మాజీ ఎంపీపీ గోపిరాజు.... మాజీ సర్పంచులు గేదెల చంద్రారావు, నమ్మి వెంకట్రావు.. భీమిలి 25వ వార్డు అధ్యక్షుడు సూర్యబాబు తెలుగుదేశంలో చేరారు. గంగాధర నెల్లూరులో సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ బాబు నాయుడు, మాజీ సర్పంచ్ జయచంద్ర నాయుడు తెదేపా గూటికి చేరారు. వీరికి చంద్రబాబు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కృష్ణాజిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో100 మంది యువత తెదేపాలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుడివాడలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పే ధైర్యం కొడాలి నానికి ఉందా అని రాము సవాల్ విసిరారు. జూద క్రీడలు, గంజాయి విక్రయాలు, మట్టి మాఫియాలతో గుడివాడను నాని నాశనం చేశారని మండిపడ్డారు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 224 కుటుంబాలు... తెదేపా నేత సోమిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరాయి. 150 కుటుంబాలతో వైకాపాను వీడి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. చిన్న సంఘం నుంచి 52 కుటుంబాలు... వడ్డిపాలెం, నేలటూరుకు చెందిన 22 కుటుంబాలు తెదేపా గూటికి చేరాయి. వైకాపాలో తమకు తగిన గౌరవం ఉండటం లేదని ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండల వైకాపా నాయకులు చెప్పారు. కూటమి అభ్యర్థి విజయ కుమార్ సమక్షంలో 100 కుటుంబాలు తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో భాజపా, జనసేన నాయకులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మాజీమంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో భారీగా వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు జరిగాయి. కనగానపల్లి మండలంలో వైకాపా మాజీ Z.P.T.C ఈశ్వరయ్య, వైకాపా సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో... దాదాపు 300 మంది తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలో రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అరాచకాలకు అడ్డేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్యకర్తకు తెదేపా కుటుంబం అండగా ఉంటుందని రాప్తాడు కూటమి అభ్యర్థి పరిటాల సునీత భరోసా ఇచ్చారు

Tags

Read MoreRead Less
Next Story