Air India Express : ఏసీ ట్రైన్ కంటే ఫ్లైట్ బెటర్ గురూ..రూ.1,950 కే విమానం టికెట్ అంటే నమ్ముతారా?

Air India Express : కొత్త ఏడాదిలో విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారికి టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సాధారణంగా నెల చివరిలో అందరి జేబులు ఖాళీగా ఉంటాయి కాబట్టి, మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని పే-డే సేల్ పేరుతో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో విమాన టికెట్ల ధరలు ఏకంగా ట్రైన్ ఏసీ కంపార్ట్‌మెంట్ టికెట్ ధరల కంటే తక్కువగా ఉండటం విశేషం.
టికెట్ ధరలు.. రూట్ మ్యాప్: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన కొత్త సేల్‌లో భాగంగా దేశీయ విమాన టికెట్ల ప్రారంభ ధరను కేవలం రూ. 1,950 గా నిర్ణయించింది. ఇక విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం అంతర్జాతీయ విమాన టికెట్లు రూ. 5,590 నుండే ప్రారంభమవుతున్నాయి. ఈ అదిరిపోయే ఆఫర్ జనవరి 1, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారు జనవరి 12, 2026 నుండి అక్టోబర్ 2026 వరకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడే తక్కువ ధరకే టికెట్ కొనుక్కుని, ఏడాది పొడవునా ఎప్పుడైనా హాయిగా విహరించవచ్చు.
కేవలం ఒక చిన్న బ్యాగ్‌తో ప్రయాణించే వారి కోసం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ లైట్ పేరుతో ప్రత్యేక ఫేర్ తీసుకొచ్చింది. చెక్-ఇన్ బ్యాగేజీ అవసరం లేని వారు సాధారణం కంటే చాలా తక్కువ ధరకే ఈ టికెట్లను సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత లగేజీ తీసుకెళ్లాలని అనిపిస్తే.. దేశీయ విమానాల్లో 15 కిలోల బ్యాగుకు రూ.1,500, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోల బ్యాగుకు రూ.2,500 అదనంగా చెల్లించి సర్వీసును వాడుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే ఎలాంటి కన్వీనియన్స్ ఫీజు ఉండదు.
ప్రయాణికుల ఆర్థిక ఇబ్బందులను గమనించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, పేమెంట్ విషయంలో కూడా వెసులుబాటు కల్పించింది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మొత్తం డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఈఎంఐ లేదా బుక్ నౌ పే లేటర్ వంటి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. దీనివల్ల ఒకేసారి పెద్ద మొత్తం ఖర్చు చేయలేకపోయే మధ్యతరగతి కుటుంబాలకు ఇది వరమని చెప్పాలి. స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్లు, సైనికులకు ప్రత్యేక రాయితీలు కూడా ఉన్నాయి. టాటా న్యూపాస్ మెంబర్లకు అదనంగా రూ.250 తగ్గింపు కూడా లభిస్తుంది.
రోజూ 500 పైగా విమానాలను నడుపుతున్న ఈ సంస్థ, తన లాయల్టీ మెంబర్ల కోసం బిజినెస్ క్లాస్ టికెట్లపై ఏకంగా 25 శాతం తగ్గింపు ఇస్తోంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్ దేశంలోని 45 నగరాలను, విదేశాల్లోని 16 ప్రముఖ నగరాలను అనుసంధానిస్తోంది. ఆధునిక విమానాలు, తక్కువ ధర, మెరుగైన సర్వీసులతో టాటా సంస్థ విమానయాన రంగంలో పోటీని పెంచేస్తోంది. మరి మీరు కూడా తక్కువ ధరకే గాల్లో తేలాలనుకుంటే.. రేపు (జనవరి 1) లోపు మీ సీటును కన్ఫర్మ్ చేసుకోండి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

