Bank Strike : బ్యాంకు కస్టమర్లకు అలర్ట్..వరుసగా 4 రోజులు సెలవులు..సమ్మెకు సై అంటున్న ఉద్యోగులు.

Bank Strike : బ్యాంకు కస్టమర్లకు అలర్ట్..వరుసగా 4 రోజులు సెలవులు..సమ్మెకు సై అంటున్న ఉద్యోగులు.
X

Bank Strike : జనవరి ఆఖరి వారంలో మీకు బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా నెలాఖరులో ఏకంగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ముఖ్యమైన నగదు లావాదేవీలు లేదా చెక్కుల క్లియరెన్స్ వంటి పనులు ఉంటే ఈ లోపే చక్కబెట్టుకోవడం ఉత్తమం. లేదంటే ఫిబ్రవరి వరకు వేచి చూడక తప్పదు.

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు జనవరి 27న దేశవ్యాప్త బ్యాంకు సమ్మె జరగనుంది. అయితే, ఈ సమ్మెకు ముందే వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో ఇబ్బందులు రెట్టింపు కానున్నాయి. జనవరి 24న నాలుగో శనివారం కాబట్టి సెలవు, 25న ఆదివారం, 26న రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ సెలవు ఉంటుంది. ఇక 27న సమ్మె జరిగితే, వరుసగా నాలుగో రోజు కూడా బ్యాంకులు పనిచేయవు. దీనివల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో వారానికి 5 రోజుల పని దినాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి నెలలో రెండు, నాలుగో శనివారాలు మాత్రమే సెలవులు ఉంటున్నాయి. మిగిలిన అన్ని శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించాలని వారు కోరుతున్నారు. దీనికి ప్రతిగా రోజుకు అదనంగా 40 నిమిషాలు పనిచేసేందుకు కూడా ఉద్యోగులు అంగీకరించారు. మార్చి 2024లోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీనిపై సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ వంటి సంస్థలు ఇప్పటికే వారానికి ఐదు రోజులే పనిచేస్తున్నాయని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్, కరెన్సీ మార్కెట్లు కూడా శనివారం పనిచేయవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా శనివారం సెలవు ఉన్నప్పుడు.. బ్యాంకుల విషయంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ నిరసనను వ్యక్తం చేసేందుకు జనవరి 27, 2026న సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు.

దేశంలోని 9 ప్రధాన బ్యాంకు యూనియన్ల సమాహారమైన UFBU ఈ సమ్మెను ముందుండి నడిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా #5DayBankingNow అనే హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి నెటిజన్ల నుంచి కూడా భారీ స్పందన వస్తోంది. ఏదేమైనా ఈ నాలుగు రోజుల పాటు ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ముందే తగినంత నగదును దగ్గర ఉంచుకోవడం మంచిది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు పనిచేసినప్పటికీ, బ్రాంచ్‌లో నేరుగా చేసే పనులు మాత్రం ఆగిపోతాయి.

Tags

Next Story