Tesla Sales : టెస్లా పనైపోయిందా? ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో చైనా డ్రాగన్ BYD ఊచకోత.

Tesla Sales : ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పెను మార్పు చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ రారాజుగా వెలిగిన అమెరికా దిగ్గజం టెస్లాకి చైనా కంపెనీ BYD గట్టి షాక్ ఇచ్చింది. విక్రయాల పరంగా టెస్లాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే నంబర్-1 ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా BYD అవతరించింది. వరుసగా రెండో ఏడాది కూడా టెస్లా అమ్మకాలు పడిపోవడంతో ఈ మార్పు అనివార్యమైంది.
2025 గణాంకాల ప్రకారం.. టెస్లా కేవలం 16 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించగలిగింది. దీనికి భిన్నంగా, చైనా కంపెనీ BYD ఏకంగా 28 శాతం వృద్ధితో 26.4 లక్షల ఈవీలను అమ్మింది. అంటే టెస్లా కంటే దాదాపు 10 లక్షల కార్లు ఎక్కువే. ఒకప్పుడు ఈవీ రంగంలో ఎదురులేకుండా సాగిన టెస్లాకు, చైనా కంపెనీల నుంచి వస్తున్న పోటీ ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. 2025 చివరి నాటికి BYD మొత్తం విక్రయాలు 46 లక్షల యూనిట్లకు చేరుకోవడం విశేషం.
టెస్లా అమ్మకాలు తగ్గడానికి అమెరికాలోని ట్యాక్స్ నిబంధనలు ఒక కారణమైతే, ఎలోన్ మస్క్ రాజకీయ ధోరణి మరొక ముఖ్య కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో మస్క్ సాన్నిహిత్యం, కొత్తగా ఏర్పడిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ బాధ్యతలు తీసుకోవడం వల్ల పర్యావరణ హితం కోరుకునే కస్టమర్లు టెస్లాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు అమెరికాలో ఈవీలపై ఇచ్చే 7,500 డాలర్ల సబ్సిడీని ట్రంప్ ప్రభుత్వం క్రమంగా ఎత్తివేయడం కూడా టెస్లాకు కోలుకోలేని దెబ్బ కొట్టింది.
టెస్లాను దెబ్బకొట్టడంలో ఒక్క BYD మాత్రమే కాదు.. గీలీ, షావోమీ వంటి ఇతర చైనా కంపెనీలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో చైనా కంపెనీలు కార్లను మార్కెట్లోకి తెస్తుండటంతో కస్టమర్లు అటువైపు మొగ్గు చూపుతున్నారు. BYD తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త జనరేషన్ మోడళ్లను, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మే 2025లో మస్క్ తన ప్రభుత్వ పదవికి రాజీనామా చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

