7th Pay Commission : పదేళ్లలో పెరిగిన జీతం ఎంతో తెలుసా? ఉద్యోగుల లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2025వ సంవత్సరం ఎంతో కీలకమైనది. ఎందుకంటే 7వ వేతన సంఘం అమలులోకి వచ్చి ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి సరిగ్గా పదేళ్లు పూర్తవుతాయి. ఒక పూర్తి శాలరీ సైకిల్ ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘంపై పడింది. అయితే గత పదేళ్ల కాలంలో ఉద్యోగుల జీతాలు అసలు ఎంత పెరిగాయి? 6వ వేతన సంఘం ముగిసే సమయానికి ఇప్పుడున్న పరిస్థితులకు తేడా ఏంటి? అన్నది ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన విషయం. దీనికి సంబంధించిన పూర్తి లెక్కలు చూద్దాం.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో మారిన తలరాత
7వ వేతన సంఘం రాకతో ఉద్యోగుల జీతాల లెక్కింపు పద్ధతి పూర్తిగా మారిపోయింది. అప్పట్లో ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించింది. అంటే, 6వ వేతన సంఘం నాటి బేసిక్ పేను ఈ సంఖ్యతో గుణించి కొత్త బేసిక్ పేని ఖరారు చేశారు. దీనివల్ల పాత గ్రేడ్ పే పద్ధతి రద్దయి, దాని స్థానంలో పే మ్యాట్రిక్స్ అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఏ లెవల్ ఉద్యోగికి ఎంత జీతం పెరుగుతుందో సులభంగా అర్థం చేసుకునే వీలు కలిగింది.
పదేళ్ల క్రితం పరిస్థితి ఏంటి?
31 డిసెంబర్ 2015 నాటికి, అంటే 6వ వేతన సంఘం చివరి రోజుల్లో లెవల్-1 ఉద్యోగి పరిస్థితిని గమనిస్తే.. అప్పట్లో బేసిక్ పే రూ.7,000 ఉండగా, గ్రేడ్ పే రూ.1,800 కలిపి మొత్తం బేసిక్ రూ.8,800గా ఉండేది. ఆ సమయంలో కరువు భత్యం 119 శాతానికి చేరడంతో అది సుమారు రూ.10,400 వరకు వచ్చేది. వీటికి ఇంటి అద్దె భత్యం, ఇతర చిన్న చిన్న అలవెన్సులు కలిపి ఆ రోజుల్లో లెవల్-1 ఉద్యోగి చేతికి రూ.22,000 వరకు జీతం వచ్చేది. అంటే కొత్త వేతన సంఘం రాకముందే డీఏ ద్వారా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతం సర్దుబాటు అయ్యింది.
ప్రస్తుత జీతం ఎంత పెరిగింది?
7వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత మినిమమ్ బేసిక్ శాలరీ రూ.18,000కు పెరిగింది. ఇప్పుడు 2025 నాటికి డీఏ సుమారు 58 శాతానికి చేరుకుంది. దీని ప్రకారం రూ.18,000 బేసిక్‌పై డీఏ సుమారు రూ.10,400 వస్తుంది. దీనికి తోడు మెట్రో నగరాల్లో హెచ్‌ఆర్ఏ రూ.5,400 వరకు పెరిగింది. వెరసి, పదేళ్ల క్రితం రూ.22,000 అందుకున్న లెవల్-1 ఉద్యోగి, నేడు సుమారు రూ.34,000 వరకు జీతం అందుకుంటున్నాడు. అంటే పదేళ్ల కాలంలో జీతంలో సుమారు 55 శాతం పెరుగుదల కనిపించింది.
8వ వేతన సంఘంపై భారీ అంచనాలు
గత పదేళ్లలో జీతాలు పెరిగిన మాట వాస్తవమే అయినా, అందులో ఎక్కువ భాగం కరువు భత్యం రూపంలోనే వచ్చింది తప్ప, బేసిక్ పే మాత్రం 2016 నుంచి అలాగే ఉంది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో కేవలం డీఏ పెంపుతో తమ అవసరాలు తీరవని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను భారీగా పెంచాలని, కనీస వేతనాన్ని రూ.18,000 నుంచి రూ.26,000 లేదా అంతకంటే ఎక్కువ చేయాలని ఉద్యోగులు గట్టిగా కోరుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

