Food Delivery : జొమాటో, స్విగ్గీ యూజర్లకు షాక్..ఆ రెండు రోజులు డెలివరీ బంద్..ఎందుకో తెలుసా?

Food Delivery : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చే అలవాటు ఉన్నవారికి, ఇంటికి కావాల్సిన సామాన్లు క్విక్ కామర్స్ యాప్స్‌లో కొనేవారికి ఇది షాకింగ్ న్యూస్. ప్రముఖ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ డెలివరీ భాగస్వాములు సమ్మె బాట పట్టారు. క్రిస్మస్ (డిసెంబర్ 25), కొత్త ఏడాది వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న డెలివరీ సేవలను నిలిపివేస్తున్నట్లు డెలివరీ వర్కర్ల యూనియన్లు ప్రకటించాయి. ఈ కీలక రోజుల్లో సమ్మె జరగనుండటంతో కస్టమర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు.
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా ఈ నిరసనకు పిలుపునిచ్చాయి. తమ పని పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, జీతాలు సరిపోవడం లేదని, కనీస సామాజిక భద్రత కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేసిన యూనియన్ నేతలు, దేశవ్యాప్తంగా ఉన్న డెలివరీ బాయ్స్ అందరూ ఈ పోరాటంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పండుగ రోజుల్లో కంపెనీలకు భారీ లాభాలు వస్తున్నా, ఆ కష్టంలో భాగస్వాములైన వర్కర్లకు మాత్రం మొండిచేయే ఎదురవుతోందని వారు మండిపడుతున్నారు.
ముఖ్యంగా ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, పని ప్రదేశంలో భద్రత, సామాజిక భద్రతా ప్రయోజనాలే ప్రధాన డిమాండ్లుగా ఈ సమ్మె సాగనుంది. TGPWU వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. "ప్లాట్‌ఫారమ్ కంపెనీలు వర్కర్ల ప్రాణాలను పణంగా పెట్టి కోట్లు గడిస్తున్నాయి. కానీ వర్కర్లకు మాత్రం సరైన ఆదాయం లేదు, ప్రమాదం జరిగితే ఆదుకునే నాథుడు లేడు. ఇది కేవలం సమ్మె మాత్రమే కాదు.. న్యాయం, గౌరవం కోసం చేస్తున్న పోరాటం. ప్రభుత్వం కూడా ఇకపై మౌనంగా ఉండకూడదు" అని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇటీవల గిగ్ వర్కర్ల కోసం కొత్త కార్మిక చట్టాలను ప్రకటించిన కొద్ది వారాలకే ఈ నిరసన రావడం గమనార్హం. కొత్త నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ కంపెనీలు తమ వార్షిక టర్నోవర్‌లో 1-2% నిధులను గిగ్ వర్కర్ వెల్ఫేర్ ఫండ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. ఈ చట్టాలను తాము పాటిస్తామని జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారేవరకు తమ పోరాటం ఆగదని యూనియన్లు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ సమ్మె ప్రభావం పండుగ సీజన్ బిజినెస్‌పై ఎంతవరకు పడుతుందో వేచి చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

