Gold Price : తులం బంగారం రూ.1.42లక్షలు..షాక్‌లో సామాన్యుడు..కానీ పెళ్లిళ్ల కోసం జనం కనిపెట్టిన కొత్త ఐడియా ఇదే.

Gold Price : బంగారం ధరలు ఇప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. తులం బంగారం ధర ఏకంగా రూ.1.42లక్షలకు చేరడంతో సామాన్యుల గుండెల్లో గుబులు మొదలైంది. భారతీయులకు బంగారం అంటే కేవలం లోహం కాదు, అదొక సెంటిమెంట్. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనడం అనేది ఒక సంప్రదాయం. అయితే, ప్రస్తుత ధరలు చూస్తుంటే కొనే పరిస్థితి కనిపించడం లేదు. కానీ, మన భారతీయ కస్టమర్లు ఇక్కడ కూడా ఒక కొత్త ఉపాయం కనిపెట్టారు. ధరలు పెరిగినా సరే, తక్కువ ఖర్చుతో పండగ చేసుకునే కొత్త ట్రెండ్‌ను మార్కెట్లోకి తెచ్చారు.
22 క్యారెట్లు మర్చిపోండి.. 14 క్యారెట్లే ముద్దు
గతంలో ఎవరైనా సరే 22 క్యారెట్ల బంగారాన్నే కొనాలని మొండికేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. సిఎన్‌బిసి నివేదిక ప్రకారం, బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇప్పుడు 14 క్యారెట్, 18 క్యారెట్ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కేవలం డైమండ్ జ్యువెలరీ తయారీకే వాడే ఈ తక్కువ క్యారెట్ల బంగారాన్ని, ఇప్పుడు సాధారణ గొలుసులు, ఉంగరాలు, గాజుల తయారీకి కూడా వాడుతున్నారు. దీనివల్ల ధర భారీగా తగ్గడమే కాకుండా, నగలు కూడా చాలా గట్టిగా ఉంటాయని కస్టమర్లు భావిస్తున్నారు.
సగానికి పడిపోయిన ప్యూర్ గోల్డ్ డిమాండ్
అహ్మదాబాద్ జ్యువెలర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం.. 2025 ప్రారంభంలో తులం బంగారం ధర సుమారు రూ.80 వేల వద్ద ఉంటే, ఏడాది ముగిసేసరికి అది రూ.1.42 లక్షలకు చేరింది. అంటే దాదాపు రెట్టింపు. ఈ కారణంగా రెండేళ్ల క్రితం వరకు పెళ్లిళ్ల మార్కెట్‌లో 22 క్యారెట్ల నగల వాటా 75 శాతంగా ఉంటే, ఇప్పుడు అది కేవలం 50 శాతానికి పడిపోయింది. మిగిలిన 50 శాతం మార్కెట్‌ను 14, 18 క్యారెట్ల నగలు ఆక్రమించేశాయి. ఉదాహరణకు.. ఒక తల్లి తన కుమార్తె పెళ్లి కోసం 22 క్యారెట్లు కొన్నా, కుమారుడి చైన్ లేదా ఉంగరం కోసం మాత్రం 14 క్యారెట్లనే ఎంచుకుంటోంది.
బంగారానికి ఎందుకింత రెక్కలు వచ్చాయి?
అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా మండిపోతున్నాయి? దీని వెనుక బలమైన అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, వెనిజులా, నైజీరియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అస్థిరతను సృష్టించాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు బంగారంపైనే నమ్మకం పెంచుకుంటారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. వీటికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు కూడా బంగారానికి మరింత మద్దతునిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజలు ఇప్పుడే తక్కువ క్యారెట్ల ఆభరణాలను కొని స్టాక్ చేసుకుంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

