Indian Economy : టీమిండియా ఎకానమీ ఇక తగ్గేదేలే..జపాన్‌కు షాక్ ఇచ్చి 4వ స్థానానికి.

Indian Economy : 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న వేళ, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతి భారతీయుడు గర్వపడే వార్త వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, సవాళ్ల మధ్య కూడా భారత్ తన జైత్రయాత్రను కొనసాగించింది. జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం ఈ ఏడాదికి ఒక మధుర జ్ఞాపకం. ఇది కేవలం గణాంకాల విజయం మాత్రమే కాదు, సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా తగ్గిన ద్రవ్యోల్బణం, పెరిగిన విదేశీ ఒప్పందాల ఫలితం కూడా.
జపాన్ రికార్డును తుడిచిపెట్టిన భారత్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజా లెక్కల ప్రకారం, భారత నొమినల్ జీడీపీ 4.187 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న జపాన్ (4.186 ట్రిలియన్ డాలర్లు) స్వల్ప తేడాతో ఐదో స్థానానికి పడిపోయింది. దేశీయంగా పెరిగిన డిమాండ్, మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులు భారత్‌ను ఈ స్థాయికి చేర్చాయి. ప్రపంచ ఆర్థిక నిపుణులు సైతం భారత్ చూపిస్తున్న ఈ దూకుడును చూసి ఆశ్చర్యపోతున్నారు.
మధ్యతరగతి ప్రజలకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే వార్త ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం. 2025 అక్టోబర్ నాటికి దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం నెగటివ్ (-5.02%) లోకి వెళ్లడంతో కూరగాయలు, పప్పులు, తృణధాన్యాల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు జీఎస్టీలో చేసిన మార్పులు కూడా నిత్యావసరాల ధరలు తగ్గడానికి తోడ్పడ్డాయి. దీనివల్ల మధ్యతరగతి ఇళ్లలో ఖర్చులు తగ్గి ఆదా పెరిగింది.
వ్యాపార పరంగా 2025 భారత్‌కు కనెక్టివిటీ ఏడాదిగా నిలిచింది. బ్రిటన్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టింది. అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన స్విట్జర్లాండ్, నార్వే వంటి యూరోపియన్ దేశాల ఒప్పందం ద్వారా రాబోయే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్‌కు రానున్నాయి. వీటితో పాటు న్యూజిలాండ్, ఓమన్ వంటి దేశాలతో కుదిరిన ఒప్పందాలు అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ముద్రను మరింత పటిష్టం చేశాయి.
ఒకవైపు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతున్నా, రూపాయి విలువ తగ్గడం కాస్త ఆందోళన కలిగించే అంశం. అమెరికా విధిస్తున్న కొత్త వాణిజ్య సుంకాల ప్రభావంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 4-5 శాతం తగ్గింది. జనవరిలో 86.23 వద్ద ఉన్న రూపాయి విలువ డిసెంబర్ నాటికి 90కి చేరుకుంది. ఇది 2022 తర్వాత అత్యంత పేలవమైన ప్రదర్శన. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అయినప్పటికీ పన్ను వసూళ్లు పెరగడం వల్ల దేశ ఆర్థిక లోటు అదుపులోనే ఉంది. ప్రపంచ బ్యాంక్ సైతం భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని కొనియాడటం మనందరికీ గర్వకారణం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

