INDIA: డ్రోన్ల దూకుడు.. భారత రక్షణ రంగంలో విప్లవం

INDIA: డ్రోన్ల దూకుడు.. భారత రక్షణ రంగంలో విప్లవం
X
స్వదేశీ మేధతో ఉక్కుపాదం దిశగా భారత్ డ్రోన్స్

భారత రక్షణ రంగంలో డ్రోన్లు నిజమైన గేమ్‌చేంజర్‌లుగా మారుతున్నాయి. సరిహద్దుల్లో నిఘా, శత్రువుల స్థావరాలపై దాడులు, బలగాలకు ఆవశ్యక సరఫరాలు, ఉగ్రవాదుల గుర్తింపు వంటి కార్యకలాపాల్లో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), అధునాతన సెన్సార్‌లు, హై పవర్ కెమెరాలతో కూడిన డ్రోన్లు భారత సైన్యంలో కీలకమైన భాగంగా మారాయి. ఇటీవలి భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల్లో కూడా శత్రుదేశంలోని స్థావరాలపై ఆత్మాహుతి డ్రోన్ల దాడులు జరగడం, అవి విజయవంతం కావడం సైనిక వ్యూహాల్లో డ్రోన్ల ప్రాధాన్యతను స్పష్టం చేశాయి. ఈ రంగంలో దేశీయ పరిశ్రమలు కూడా వేగంగా ఎదుగుతున్నాయి.

దేశీయ టెక్నాలజీకి బలమవుతున్న డిఫెన్స్ డ్రోన్లు

భారత డ్రోన్ పరిశ్రమ ఇప్పుడు స్వదేశీ సామర్థ్యాన్ని పెంచే దిశగా పయనిస్తోంది. డీఆర్‌డీఓ అభివృద్ధి చేస్తున్న 'రుస్తుం' సిరీస్ డ్రోన్లు మధ్యస్థ ఎత్తుల్లో ఎక్కువసేపు గగన విహారం చేయగలుగుతున్నాయి. అదానీ డిఫెన్స్‌, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాంటి ప్రముఖ సంస్థలు అధునాతన డ్రోన్ల తయారీకి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

సాంకేతికతతో ముందుకు.. స్వార్మ్ డ్రోన్ల సత్తా

ఐఐటీ గువాహటి, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఏఐ ఆధారిత స్వార్మ్ డ్రోన్లు ఒకేసారి అనేక డ్రోన్లను సమన్వయం చేసి పనిచేయగలవు. ఇది రక్షణ వ్యూహాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. అంతేగాక, 5జీ టెక్నాలజీ సహాయంతో డ్రోన్లు ప్రత్యక్ష ప్రసారాలను పంపగలుగుతున్నాయి. ఇవి భవిష్యత్తులో యుద్ధాల్లో ఫీల్డ్ కమాండర్లకు కీలక సమాచారం అందించే సాధనాలుగా మారనున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం – మారుతున్న విధానాలు

2024లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డ్రోన్ శక్తి పథకం ఈ రంగ అభివృద్ధికి బలమైన పునాది వేసింది. స్టార్ట్‌అప్‌లకు రాయితీలు, పరిశోధనకు గ్రాంట్లు, డ్రోన్ ఇన్నోవేషన్ హబ్‌లు బెంగళూరు, నోయిడాల్లో నెలకొల్పబడ్డాయి. ఇవి పరిశోధకులకు, సంస్థలకు అవసరమైన టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నాయి. 2030 నాటికి భారత డ్రోన్ మార్కెట్ విలువ $23 బిలియన్ (రూ.2 లక్షల కోట్లు)కు చేరుకోనుంది. డ్రోన్ల రంగంలో దేశీయ పరిశ్రమలు కూడా వేగంగా ఎదుగుతున్నాయి. డ్రోన్ల ఎగుమతిలో సాంకేతికలో భారత్ సాధిస్తున్న పురోగతి సరికొత్త శకాన్ని ఆరంభిస్తోంది. భారత్-పాక్ యుద్ధంలోనూ ఇండియా డ్రోన్లు సత్తా చాటాయి.

Tags

Next Story