Insurance Scam : ఇన్సూరెన్స్ రిఫండ్ పేరుతో భారీ మోసం..మీ పాత పాలసీ డబ్బులు ఇస్తామంటే నమ్మకండి.

Insurance Scam : ఇన్సూరెన్స్ రిఫండ్ పేరుతో భారీ మోసం..మీ పాత పాలసీ డబ్బులు ఇస్తామంటే నమ్మకండి.
X

Insurance Scam : ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నవారిని టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. మీ పాత పాలసీ డబ్బులు పెరిగాయి.. ప్రభుత్వం మీకు రిఫండ్ ఇస్తోంది అంటూ నమ్మబలికి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి? ఎలా జాగ్రత్తగా ఉండాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో చాలా మందికి ఒక వింత కాల్ వస్తోంది. మీరు 2009లో తీసుకున్న రూ.50 వేల పాలసీ ఇప్పుడు రూ.5 లక్షలు అయ్యింది. ఆ డబ్బును ప్రభుత్వం మీకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది అని అవతలి వ్యక్తి చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సదరు వ్యక్తికి మీ పేరు, మీ పాలసీ నంబర్, మీరు కట్టిన ప్రీమియం వివరాలన్నీ ముందే తెలుసు. దీంతో ఇది నిజమేనని నమ్మి చాలా మంది బుట్టలో పడిపోతున్నారు. అయితే ఆ డబ్బు రావాలంటే మీరు ఒక కొత్త పాలసీ తీసుకోవాలని లేదా కొంత ప్రాసెసింగ్ ఫీజు కట్టాలని వారు కండిషన్ పెడతారు. అక్కడే అసలు మోసం మొదలవుతుంది.

నిపుణులు ఏమంటున్నారు?

బీమా రంగ నిపుణుల ప్రకారం.. ఏ ప్రభుత్వ సంస్థ, ఐఆర్‌డీఏఐ లేదా బీమా లోక్‌పాల్ పాలసీదారులకు ఫోన్ చేసి రిఫండ్ ఇస్తామని చెప్పవు. అసలు ఏ పాలసీ కూడా రూ.50 వేల నుంచి రూ.5 లక్షలకు మ్యాజిక్ లాగా పెరగదు. ఒకవేళ మీ పాలసీ లాప్స్ అయిపోతే, నిబంధనల ప్రకారం కొంత మొత్తం కట్ అయ్యి రావాలే తప్ప, ఇలా రెట్టింపులు అవ్వవు. ముఖ్యంగా రిఫండ్ డబ్బుల కోసం కొత్త పాలసీ కొనమనడం అనేది వంద శాతం మోసమని గ్రహించాలి. కేటుగాళ్లు ఏదో ఒక రకంగా బీమా కంపెనీల డేటాను సంపాదించి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.

మీరు చేయకూడని పనులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను గుడ్డిగా నమ్మకండి. మీ పాలసీకి సంబంధించిన వివరాల కోసం నేరుగా ఆయా బీమా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి. ఎవరికీ మీ ఓటీపీ, ఆధార్ కార్డ్ లేదా ఇతర వ్యక్తిగత పత్రాలను షేర్ చేయవద్దు. రిఫండ్ ఇస్తామన్నారు కదా అని ముందే డబ్బులు చెల్లించకండి. ఒక్కసారి మీరు డబ్బులు కడితే, ఆ తర్వాత వారు కాల్ లిఫ్ట్ చేయరు సరికదా, మీ డేటాతో మరిన్ని మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.

సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక

ఒకవేళ మీరు ఇప్పటికే ఇలాంటి మోసానికి గురైతే, వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇన్సూరెన్స్ అనేది మీ భవిష్యత్తు భద్రత కోసం, కానీ కేటుగాళ్ల అత్యాశకు అది వేదిక కాకూడదు. అతి తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయనే ప్రకటనలు ఎప్పుడూ ప్రమాదకరమే. అప్రమత్తంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.

Tags

Next Story