Mahindra XUV 7XO : టాటా సఫారీకి వణుకు మొదలైంది..మహీంద్రా కొత్త ఎస్‌యూవీ షోరూమ్‌లో దిగిపోయింది

Mahindra XUV 7XO : మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో పవర్‌ఫుల్ ఎస్‌యూవీ మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. ఎంతో కాలంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న మహీంద్రా XUV 7XO ఎట్టకేలకు డీలర్ షోరూమ్‌లకు చేరుకుంది. XUV700 వారసత్వాన్ని మరింత లగ్జరీగా, టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్లేందుకు వస్తున్న ఈ కారు.. జనవరి 5న అధికారికంగా లాంచ్ కానుంది. షోరూమ్ వద్ద తెల్లటి కవర్‌తో కప్పి ఉన్న ఈ కారు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డీలర్ షోరూమ్ వద్ద కనిపించిన XUV 7XO డిజైన్ ఎలిమెంట్స్ కార్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇందులో కొత్తగా డిజైన్ చేసిన 19-అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న XUV700లో 17 లేదా 18 అంగుళాల వీల్స్ ఉండగా, కొత్త మోడల్‌లో వీటి సైజు పెంచి మరింత రఫ్ అండ్ టఫ్ లుక్ ఇచ్చారు. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే.. స్కార్పియో-ఎన్ తరహాలో డ్యూయల్ బ్యారెల్ ప్రొజెక్టర్ సెటప్ ఇచ్చారు. గతంలో కింద వరకు సాగే డీఆర్ఎల్స్ ఇప్పుడు U ఆకారంలోకి మారిపోయి కొత్త అందాన్ని తెచ్చాయి. ఫాగ్ ల్యాంప్స్ డిజైన్ కూడా పూర్తిగా మారిపోయింది.
కంపెనీ విడుదల చేసిన టీజర్ల ప్రకారం.. XUV 7XO ఇంటీరియర్ విమానం కాక్‌పిట్‌ను తలపిస్తోంది. ఇందులో మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల నుంచి స్ఫూర్తి పొందిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉండబోతోంది. అంటే డ్యాష్‌బోర్డ్ మొత్తం స్క్రీన్లతో నిండిపోతుంది. సీట్ల కోసం ప్రీమియం అప్హోల్స్టరీని వాడారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 540-డిగ్రీ కెమెరా (కారు చుట్టూ, కింద కూడా చూడొచ్చు) ప్రత్యేక ఆకర్షణ. వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుల కోసం విడిగా ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు.
లుక్స్ పరంగా మార్పులు చేసినా, ఇంజిన్ విషయంలో మహీంద్రా తన నమ్మకమైన పవర్ ఫుల్ ఇంజిన్లనే కొనసాగిస్తోంది. ఇందులో 2.0 లీటర్ టర్బో-పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. ఇవి మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ లతో అందుబాటులో ఉంటాయి. XUV700 లాగే ఇందులో కూడా టాప్ వేరియంట్లకు ఆల్-వీల్ డ్రైవ్ సదుపాయం ఉంటుంది. అంటే మీరు ఈ కారును ఎక్కడైనా, ఎలాంటి రోడ్డు మీదైనా నిశ్చింతగా తీసుకెళ్లొచ్చు.
జనవరి 5న లాంచ్ కానున్న ఈ కారు ధరలు, పూర్తి వేరియంట్ల వివరాలను మహీంద్రా ప్రకటించనుంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి కార్లకు ఈ XUV 7XO గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, అదిరిపోయే లుక్, మహీంద్రా బ్రాండ్ వాల్యూ తో ఈ ఎస్‌యూవీ 2026లో సేల్స్ రికార్డులను తిరగరాస్తుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

