Share Market Crash : ఇన్వెస్టర్లకు బ్లాక్ ఫ్రైడే.. మార్కెట్ ప్రారంభంలోనే రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి.

Share Market Crash : ఇన్వెస్టర్లకు బ్లాక్ ఫ్రైడే.. మార్కెట్ ప్రారంభంలోనే రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి.
X

Share Market Crash : వారంతపు రోజున దేశీయ స్టాక్ మార్కెట్లలో పెను ప్రకంపనలు రేగాయి. శుక్రవారం (మార్చి 6) ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలై ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల సునామీ రావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలకు తోడు, ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో మార్కెట్ రక్తం చిందించింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ కీలకమైన 24,600 స్థాయి కంటే దిగువకు పడిపోవడం మార్కెట్ వర్గాలను ఆందోళనలో పడేసింది.

నిన్నటి ముగింపుతో పోలిస్తే నేడు మార్కెట్లు గ్యాప్-డౌన్‎తో ప్రారంభమయ్యాయి. గురువారం 80,015 వద్ద ముగిసిన సెన్సెక్స్, నేడు 356 పాయింట్ల నష్టంతో 79,658 వద్ద ఓపెన్ అయింది. అక్కడితో ఆగకుండా అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ట్రేడింగ్ మధ్యలో 0.69 శాతం క్షీణించి 79,464 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. క్రితం సెషన్‌లో 24,765 వద్ద ఉన్న నిఫ్టీ, నేడు 109 పాయింట్లు నష్టపోయి 24,656 వద్ద ప్రారంభమైంది. చూస్తుండగానే మరో 168 పాయింట్లు కోల్పోయి 24,597 వద్దకు పడిపోయింది. మార్కెట్లు ఇలా పాతాళానికి పడిపోవడంతో సామాన్య ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.

నేటి పతనంలో బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ ఏకంగా 2.60% పడిపోగా, ఇండిగో, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్ షేర్లు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్ వంటి బలమైన షేర్లు కూడా ఎర్ర నిశానంలోనే కొట్టుమిట్టాడాయి. అయితే, ఇంతటి విలయంలోనూ ఐటీ రంగం ఇన్వెస్టర్లకు ఆశాకిరణంగా నిలిచింది. హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతూ మార్కెట్‌కు కొంత అండగా నిలిచాయి. వీటికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు కూడా స్వల్పంగా పుంజుకుని మార్కెట్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాయి.

Tags

Next Story