Gig Workers : ఓలా, ఉబెర్ డ్రైవర్లకు జాక్‌పాట్..ఏడాదికి 90 రోజులు పనిచేస్తే చాలు.

Gig Workers : నేటి కాలంలో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో పనిచేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, వీరికి సరైన ఉద్యోగ భద్రత గానీ, బీమా సౌకర్యాలు గానీ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్స్, అసంఘటిత రంగ కార్మికుల కోసం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏడాదిలో కేవలం 90 రోజులు పనిచేసినా సరే, ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలకు అర్హత సాధించవచ్చని కొత్త నిబంధనలను ప్రతిపాదించింది.
సాంప్రదాయ ఉద్యోగుల మాదిరిగానే గిగ్ వర్కర్లకు కూడా సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా డ్రాఫ్ట్ నిబంధనల ప్రకారం.. ఒక కార్మికుడు ఏడాదిలో కనీసం 90 రోజుల పాటు ఏదైనా ప్లాట్‌ఫారమ్‌లో పనిచేస్తే, వారు ప్రభుత్వం అందించే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలకు అర్హులవుతారు. అంతేకాకుండా వీరిని ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి కూడా తీసుకురానున్నారు. దీనివల్ల లక్షలాది మంది కార్మికులకు ఉచిత వైద్య సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
చాలామంది డ్రైవర్లు లేదా డెలివరీ ఏజెంట్లు ఒకే సమయంలో ఓలా, ఉబెర్ లేదా స్విగ్గీ, జొమాటో యాప్స్ ఆన్ చేసుకుని పనిచేస్తుంటారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. ఒకటి కంటే ఎక్కువ ప్లాట్‌ఫారమ్స్‌లో పనిచేసే వారు ఏడాదిలో 120 రోజులు లాగిన్ అయి ఉండాలి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒక వ్యక్తి ఒకే రోజులో మూడు వేర్వేరు యాప్స్‌లో యాక్టివ్‌గా ఉంటే, దాన్ని మూడు పనిదినాలుగా లెక్కిస్తారు. అంటే.. మీరు రోజుకు మూడు కంపెనీల కోసం పనిచేస్తే, కేవలం 40 రోజులు పనిచేసినా 120 రోజుల టార్గెట్ పూర్తయిపోతుంది. ఇది పార్ట్-టైమ్ పనిచేసే వారికి గొప్ప అవకాశం.
ఈ సౌకర్యాలు పొందడానికి మీరు సదరు కంపెనీలో నేరుగా చేరాల్సిన అవసరం లేదు. ఏదైనా థర్డ్ పార్టీ ఏజెన్సీ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నా సరే, మీకు ఈ బెనిఫిట్స్ అందుతాయి. ఈ కొత్త రూల్స్ వల్ల కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట పడటమే కాకుండా, కార్మికులకు ఒక రకమైన భరోసా లభిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 1.27 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని అంచనా. 2029-30 నాటికి ఈ సంఖ్య 2.35 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మైలురాయిగా నిలవనుంది.
గిగ్ వర్కర్ల శ్రమను గుర్తించిన ప్రభుత్వం, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందిస్తోంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా ఆదుకోవడం, అనారోగ్యం పాలైతే ఉచితంగా వైద్యం అందించడం వంటివి ఇందులో ప్రధాన అంశాలు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే, భారతదేశంలో గిగ్ ఎకానమీ మరింత పటిష్టం అవుతుంది. కార్మికులు తమ హక్కుల గురించి ఆందోళన చెందకుండా స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఏర్పడుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

