Share Market : షేర్ మార్కెట్‌లో సంచలనం.. నిఫ్టీ-50 లోకి బీఎస్ఈ ఎంట్రీ.

Share Market : షేర్ మార్కెట్‌లో సంచలనం.. నిఫ్టీ-50 లోకి బీఎస్ఈ ఎంట్రీ.
X

Share Market : భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక అరుదైన అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్ఛేంజ్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, ఇకపై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‎కి చెందిన ప్రధాన సూచీ నిఫ్టీ 50లో భాగం కాబోతోంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ క్యాపిటల్ తాజాగా విడుదల చేసిన విశ్లేషణాత్మక నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 2026 లో జరిగే నిఫ్టీ-50 అర్ధవార్షిక ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్‌లో ఐటీ దిగ్గజం విప్రో స్థానాన్ని బీఎస్ఈ భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు రెండో వారంలో వెలువడనుండగా, సెప్టెంబర్ 30, 2026 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతి ఆరు నెలలకొకసారి తన సూచీల్లోని కంపెనీల పనితీరును సమీక్షిస్తుంది. ఇందుకోసం ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్-కమిటీ ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు ఆరు నెలల సగటు మార్కెట్ డేటాను పరిగణనలోకి తీసుకుంటుంది. ఫిబ్రవరి 1 నుంచి మే 15 వరకు ఉన్న తాజా డేటా ఆధారంగా యాక్సిస్ క్యాపిటల్ ఈ అంచనా వేసింది. దీని ప్రకారం రాబోయే రీబ్యాలెన్సింగ్‌లో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఒక మార్పు, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్‌లో 5 మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని నివేదిక స్పష్టం చేసింది.

ఒకవేళ యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసినట్లు బీఎస్ఈ గనుక నిఫ్టీ-50 లోకి ప్రవేశిస్తే.. ఆ కంపెనీ షేర్లలోకి గ్లోబల్ ఇన్వెస్టర్లు, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఈ మార్పు వల్ల బీఎస్ఈ లోకి ఏకంగా 657 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,500 కోట్లు) కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఇండెక్స్ ఫండ్స్ దాదాపు 15.7 మిలియన్ షేర్లను కొనుగోలు చేయనున్నాయి. మరోవైపు, నిఫ్టీ నుంచి తప్పుకోనున్న విప్రో కంపెనీ నుంచి 225 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,880 కోట్లు) పెట్టుబడులు బయటకు వెళ్లిపోనున్నాయి. దీనివల్ల ఫండ్స్ సుమారు 114.2 మిలియన్ విప్రో షేర్లను విక్రయించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా విప్రో షేర్లు మార్కెట్లో తీవ్రంగా నష్టపోతున్నాయి. గడిచిన ఆరు నెలల్లోనే 20 శాతం, ఈ ఏడాది ఆరంభం నుండి ఇప్పటివరకు ఏకంగా 27 శాతం మేర విప్రో షేరు పతనం కావడం గమనార్హం.

నిఫ్టీ-50తో పాటు నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్‌లోనూ భారీ ఫేర్‌బదల్ జరగనుంది. ఈ సూచీలోకి ఎంట్రీ ఇవ్వడానికి విప్రోతో పాటు పాలీక్యాబ్ ఇండియా, హిటాచీ ఎనర్జీ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ కంపెనీలు రేసులో ముందున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత ఇండెక్స్ నుంచి ఇండియన్ హోటల్స్ కంపెనీ, ఆర్‌ఈసీ, శ్రీ సిమెంట్స్, జైడస్ లైఫ్‌సైన్సెస్, లోధా డెవలపర్స్ కంపెనీలు బయటకు వెళ్లే అత్యంత ఆశాజనకమైన అభ్యర్థులుగా కనిపిస్తున్నాయి.

ఐటీ జెయింట్ విప్రోను వెనక్కి నెట్టి నిఫ్టీలో స్థానం సంపాదించే స్థాయికి బీఎస్ఈ ఎదగడానికి దాని ఆర్థిక ఫలితాలే కారణం. ఆర్థిక సంవత్సరం 2026 మార్చి త్రైమాసికానికి (Q4) గాను బీఎస్ఈ ఏకంగా రూ.797 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.494 కోట్లతో పోలిస్తే ఇది 61 శాతం భారీ గ్రోత్. అలాగే నాలుగో త్రైమాసికంలో ఆదాయం 85 శాతం పెరిగి రూ.1,564 కోట్లకు చేరింది. మొత్తం ఆర్థిక సంవత్సరం 2026 కి గాను బీఎస్ఈ రూ.5,148 కోట్ల రాబడిని ఆర్జించగా.. ఎబిటా మార్జిన్ అద్భుతంగా 48 శాతంగా నమోదైంది. ఈ బలమైన ఆర్థిక పునాదే బీఎస్ఈ ని నిఫ్టీ రేసులో నిలబెట్టింది.

Tags

Next Story