Ola Cabs Ceo : ఓలా క్యాబ్స్ సీఈఓ హేమంత్ బక్షి రాజీనామా

ఓలా క్యాబ్స్ సీఈఓ హేమంత్ బక్షి తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టిన హేమంత్ (Hemant) నాలుగు నెలలు తిరగకుండానే వైదొలగడం గమనార్హం. ప్రస్తుతం ఆ బాధ్యతలను ఓలా సహవ్యవస్థాపకుడు భవేశ్ అగర్వాల్ పర్యవేక్షిస్తారని, త్వరలోనే కొత్త సీఈఓ నియామకం ఉంటుందని సమాచారం. మరోవైపు సంస్థ పునరుద్ధరణలో భాగంగా చేపట్టనున్న చర్యలతో 10% మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓలా క్యాబ్స్ సీఈఓగా ఈ ఏడాది జనవరిలో భక్షి జాయిన్ అయ్యారు
ఓలా క్యాబ్స్ ఐపీఓకి రావాలని చూస్తుండగా, తాజాగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో చర్చలు జరిపింది. ఈ చర్చలు జరిగిన కొన్ని వారాల్లోనే కంపెనీ సీఈఓ రాజీనామా చేయడం గమనించాలి. గత నెల రోజుల్లో టాప్ మేనేజ్‌మెంట్‌ను ఓలా క్యాబ్స్ మార్చింది. సీఎఫ్‌ఓగా కార్తిక్ గుప్తాను, సీబీఓగా సిద్ధార్ధ్ శక్ధర్‌ను నియమించింది.
మరోవైపు తాము ఈసారి పది వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తామని మనదేశంలో మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ వెల్లడించారు. హెచ్‌సీఎల్ టెక్ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో 2,700 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకున్నట్టు ప్రకటించింది. కంపెనీ వృద్ధి ఆశించినస్థాయిలో ఉన్నందున కొత్త వారికి తప్పకుండా ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. తాజా క్వార్టర్లో ఈ కంపెనీ రూ.3,986 కోట్ల నికరలాభం సంపాదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com