Skoda : 25 ఏళ్ల రికార్డులు బద్ధలు..ఒక్క కారు స్కోడా కంపెనీ దశ తిప్పేసింది.

Skoda : యూరోపియన్ కార్ల తయారీ దిగ్గజం స్కోడా ఇండియా మార్కెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు స్లోగా సాగిన ఈ కంపెనీ సేల్స్, ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. గడచిన 25 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా 2025 ఏడాదిని స్కోడా అత్యంత విజయవంతంగా ముగించింది. కేవలం ఒక్కటంటే ఒక్క కారు మోడల్ ఆ కంపెనీ తలరాతనే మార్చేసింది. 2024లో కేవలం 35 వేల కార్లు అమ్మిన స్కోడా, 2025 నాటికి ఏకంగా 72 వేల మార్కును దాటేసింది. అంటే ఒక్క ఏడాదిలోనే అమ్మకాలు రెట్టింపు అయ్యాయన్నమాట.
స్కోడా సాధించిన ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణం వారి కొత్త కాంపాక్ట్ SUV స్కోడా కైలాక్. మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ కారు కస్టమర్ల మనసు గెలుచుకుంది. ప్రీమియం లుక్, అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు, అన్నింటికీ మించి సామాన్యుడికి అందుబాటులో ఉండే ధర ఉండటంతో జనం ఈ కారు కోసం ఎగబడుతున్నారు. తక్కువ బడ్జెట్‌లో స్కోడా బ్రాండ్ కారును సొంతం చేసుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు కైలాక్ ఒక గొప్ప ఆప్షన్లా మారిపోయింది.
భారతీయ రోడ్లకు తగ్గట్టుగా రూపొందించిన ఈ కైలాక్ కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది పవర్, మైలేజ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకుండా భారత్ NCAP లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, 10-ఇంచ్ టచ్ స్క్రీన్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, 17-ఇంచ్ అలాయ్ వీల్స్, 446 లీటర్ల భారీ బూట్ స్పేస్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ కాక్‌పిట్, రియర్ ఏసీ వెంట్స్ వంటి సదుపాయాలు ఈ కారును సెగ్మెంట్‌లో టాప్‌లో నిలబెట్టాయి.
ధర విషయానికి వస్తే.. స్కోడా కైలాక్ బేస్ మోడల్ కేవలం రూ.7.55 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మోడల్ ధర రూ.12.80 లక్షల వరకు ఉంటుంది. ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోలిస్తే, ఇంత తక్కువ ధరలో స్కోడా క్వాలిటీ, సేఫ్టీ లభించడం ఈ కారు సక్సెస్‌కు ప్రధాన కారణం. కంపెనీ ప్రతినిధి ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. సరైన వ్యూహం, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రొడక్ట్‌ను తీసుకురావడం వల్లే ఈ అద్భుతమైన వృద్ధి సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు.
కేవలం కార్ల అమ్మకాలే కాకుండా, దేశవ్యాప్తంగా తమ సర్వీస్ సెంటర్లను, డీలర్ నెట్‌వర్క్‌ను స్కోడా భారీగా పెంచింది. దీనివల్ల టైర్-2, టైర్-3 నగరాల్లోని కస్టమర్లకు కూడా స్కోడా కార్లు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. 2026లో మరిన్ని కొత్త మోడళ్లను తీసుకువచ్చి ఇండియాలో తమ నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

