PNB Loan Fraud : వేల కోట్లు అప్పు తీసుకుని చేతులెత్తేశారు.. ఇది కదా అసలైన బ్యాంక్ రాబరీ.

PNB Loan Fraud : వేల కోట్లు అప్పు తీసుకుని చేతులెత్తేశారు.. ఇది కదా అసలైన బ్యాంక్ రాబరీ.
X

PNB Loan Fraud : దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఏకంగా రూ.2,434 కోట్ల భారీ లోన్ మోసం వెలుగులోకి రావడంతో బ్యాంకింగ్ రంగం ఉలిక్కిపడింది. ప్రముఖ మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థ SREI గ్రూప్‎కు చెందిన రెండు కంపెనీలు ఈ ఘరానా మోసానికి పాల్పడినట్లు పీఎన్‌బీ స్వయంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలను బ్యాంక్ ఇప్పటికే భారతీయ రిజర్వ్ బ్యాంక్‎కు నివేదించింది.

ఎలా జరిగింది ఈ మోసం?

SREI గ్రూప్‌నకు చెందిన శ్రేయ్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్, శ్రేయ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అనే రెండు కంపెనీలు ఈ మోసానికి ప్రధాన కారకులని బ్యాంక్ తెలిపింది. శ్రేయ్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ దాదాపు రూ.1,241 కోట్లు, శ్రేయ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ రూ.1,193 కోట్ల మేర బ్యాంకును బురిడీ కొట్టించాయి. కంపెనీ పాత ప్రమోటర్లే ఈ నిధుల మళ్ళింపు వెనుక ఉన్నారని ప్రాథమిక సమాచారం. అయితే ఈ లోన్లకు సంబంధించి బ్యాంక్ ఇప్పటికే 100 శాతం ప్రొవిజనింగ్ (నిధుల కేటాయింపు) పూర్తి చేయడంతో, ప్రస్తుత లాభనష్టాల ఖాతాలపై దీని ప్రభావం ఉండదని పీఎన్‌బీ భరోసా ఇచ్చింది.

దివాలా తీసిన సంస్థ.. పరిష్కారం ఎక్కడ?

నిజానికి 1989లో ప్రారంభమైన SREI గ్రూప్ ఒకప్పుడు నిర్మాణ రంగ యంత్రాల ఫైనాన్స్‌లో అగ్రగామిగా ఉండేది. కానీ తప్పుడు ఆర్థిక నిర్ణయాలు, భారీగా పెరిగిన మొండి బకాయిల వల్ల అక్టోబర్ 2021లో ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ మొదలైంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) జోక్యంతో ఆగస్టు 2023లో నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ దీనిని స్వాధీనం చేసుకుని బోర్డును పునర్వ్యవస్థీకరించింది. ఈ క్రమంలోనే పాత లెక్కలు తవ్వగా ఈ భారీ స్కామ్ బయటపడింది.

మార్కెట్లో పీఎన్‌బీ పరిస్థితి ఏమిటి?

బ్యాంకు ఆస్తుల నాణ్యత విషయానికి వస్తే, పీఎన్‌బీ తన ప్రొవిజన్ కవరేజ్ రేషియోను 96.91 శాతానికి పెంచుకుంది. ఇది బ్యాంకు ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతోందనడానికి సంకేతం. స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే, ఈ వార్త తెలిసిన తర్వాత షేరు స్వల్పంగా 0.50 శాతం తగ్గి రూ. 120.35 వద్ద ముగిసింది. అయితే, గత మూడేళ్లలో ఈ బ్యాంక్ షేరు ఏకంగా 144 శాతం రిటర్న్స్ ఇచ్చి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 1,39,007 కోట్లుగా ఉంది.

Tags

Next Story