Shankh Air : వచ్చేస్తోంది శంఖ్ ఎయిర్.. కొత్త ఏడాదిలో విమాన ప్రయాణం మరింత చౌక.

Shankh Air : విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో అదిరిపోయే శుభవార్త అందింది. ఆకాశంలో విహరించాలనుకునే సామాన్యుల కలలను నిజం చేస్తూ సరికొత్త ఎయిర్‌లైన్ శంఖ్ ఎయిర్ రంగంలోకి దిగుతోంది. ఇటీవల ఇండిగో వంటి దిగ్గజ సంస్థలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త ఎయిర్‌లైన్స్‌కు అనుమతులు ఇచ్చింది. అందులో అత్యంత వేగంగా సేవలు ప్రారంభించబోతున్నది ఈ శంఖ్ ఎయిర్ మాత్రమే.
జనవరి నుంచే గగన విహారం
శంఖ్ ఎయిర్‌లైన్స్ వచ్చే ఏడాది అంటే 2026 జనవరి నెల మొదటి 15 రోజుల్లోపు నుంచే తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. మొదటగా మూడు ఎయిర్‌బస్ విమానాలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయనుంది. ఈ ఎయిర్‌లైన్ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోను కేంద్రంగా చేసుకుని ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలకు సర్వీసులను నడపనుంది. తొలి దశలో యూపీలోని అన్ని ప్రధాన నగరాలను అనుసంధానించడమే తమ లక్ష్యమని కంపెనీ చైర్మన్ శ్రవణ్ కుమార్ విశ్వకర్మ వెల్లడించారు. వచ్చే రెండు నెలల్లో మరో రెండు విమానాలను ఈ జాబితాలో చేర్చనున్నారు.
ఆటో డ్రైవర్ స్థాయి నుంచి విమానాల యజమాని వరకు
ఈ ఎయిర్‌లైన్ వెనుక ఉన్న శ్రవణ్ కుమార్ విశ్వకర్మ జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ఒకప్పుడు జీవనం కోసం తన స్నేహితులతో కలిసి ఆటో నడిపారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఎన్నోసార్లు విఫలమయ్యారు. 2014లో సిమెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాక ఆయన దశ తిరిగింది. ఆ తర్వాత స్టీల్, మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లోకి విస్తరించి, ప్రస్తుతం 400 ట్రక్కులకు యజమానిగా ఎదిగారు. విమానం అంటే కేవలం విలాసవంతమైన వస్తువు మాత్రమే కాదు, అది కూడా బస్సు, ఆటో లాంటి ఒక రవాణా సాధనమేనని సామాన్యులకు చాటి చెప్పేందుకే ఈ సంస్థను స్థాపించినట్లు ఆయన తెలిపారు.
సామాన్యుడే టార్గెట్ - అదిరిపోయే ఆఫర్లు
శంఖ్ ఎయిర్‌లైన్స్ ముఖ్య ఉద్దేశ్యం మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మొదటిసారి విమానం ఎక్కే వారికి తక్కువ ధరలో టికెట్లు అందించడం. పండగ సీజన్లలో ఇతర కంపెనీలలాగా టికెట్ ధరలను అడ్డగోలుగా పెంచబోమని శ్రవణ్ కుమార్ హామీ ఇచ్చారు. అయితే బిజినెస్ క్లాస్ ధరలు మాత్రం పోటీకి తగ్గట్టుగా ఉంటాయని చెప్పారు. 2028-29 నాటికి అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ కొత్త ఎయిర్‌లైన్ రాకతో విమానయాన రంగంలో పోటీ పెరిగి టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

