Silver Price : కేజీ వెండి కొనాలంటే కిడ్నీ అమ్మాల్సిందేనా? చరిత్ర సృష్టించిన ధరలు.

Silver Price : కొత్త ఏడాది రాకముందే వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో వెండి ధర సరికొత్త చరిత్ర సృష్టించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో వెండి ధర తొలిసారిగా రూ.2.50 లక్షల మార్కును దాటేసింది. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా రూ.14,400 పెరిగి పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేసింది. వెండితో పాటు బంగారం కూడా తన జోరును ప్రదర్శిస్తూ రూ.1.40లక్షల మార్కును అధిగమించింది.
చరిత్రలో తొలిసారి.. రికార్డు ధర
సోమవారం ఉదయం ఎంసీఎక్స్ మార్కెట్ ప్రారంభం కావడమే భారీ పెరుగుదలతో మొదలైంది. ఒకానొక దశలో వెండి ధర రూ.2,54,174 వద్ద ట్రేడయ్యి ఆల్‌టైమ్ హై రికార్డును నమోదు చేసింది. గడిచిన గురువారం రూ.2,39,787 వద్ద ముగిసిన ధర, సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా ఊపందుకోవడం విశేషం. గ్లోబల్ మార్కెట్‌లో కూడా వెండి ధర 4 శాతం పెరిగి 80 డాలర్ల మార్కును దాటేసింది. పారిశ్రామికంగా వెండికి డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
డిసెంబర్‌లో వెండి సృష్టించిన విలయం
ఈ ఒక్క నెలలోనే వెండి పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. నవంబర్ నెలాఖరులో రూ.1,74,981 గా ఉన్న కేజీ వెండి ధర, ఇప్పుడు రూ.2,54,174 కి చేరింది. అంటే కేవలం డిసెంబర్ నెలలోనే ఏకంగా రూ.79,193 పెరిగింది. దీనివల్ల ఇన్వెస్టర్లకు కేవలం ఒక్క నెలలోనే 45 శాతం లాభం వచ్చింది. ఇక ఏడాది కాలం లెక్క చూస్తే, వెండి ధర 191 శాతం పెరిగిందంటే ఈ మెటల్ ఎంతటి లాభాలను ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వెండితో పోలిస్తే బంగారం పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ, అది కూడా రూ.1.40 లక్షల మార్కును దాటి కొత్త గరిష్టాలను వెతుక్కుంటోంది.
మున్ముందు ధరలు ఇంకా పెరుగుతాయా?
వెండి ధరలు ఇక్కడితో ఆగేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెండికి అతిపెద్ద వినియోగదారు అయిన చైనా, 2026 జనవరి 1 నుంచి వెండి ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గ్లోబల్ సప్లై చైన్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ధర త్వరలోనే రూ.2,75,000 మార్కును తాకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది బంగారం ధర కూడా రూ.1.50 లక్షల స్థాయికి చేరుకోవచ్చని మార్కెట్ వర్గాల టాక్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

