Valentine's Day 2026 : ఈసారి గులాబీలు, చాక్లెట్లతో పాటు కండోమ్స్ అమ్మకాల్లో కొత్త రికార్డు.

Valentine's Day 2026 : ప్రేమ జంటల సందడి, గిఫ్ట్‌ల హోరుతో ఈ ఏడాది వాలెంటైన్స్ వీక్ (2026) సరికొత్త రికార్డులను సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ఆర్డర్లతో పోటెత్తాయి. ముఖ్యంగా ఈ వారం రోజుల్లో గులాబీలు, చాక్లెట్లతో పాటు కండోమ్స్ వంటి సెక్సువల్ వెల్‌నెస్ ప్రొడక్ట్స్ అమ్మకాలు భారీగా పెరగడం విశేషం. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం.. 2025తో పోలిస్తే ఈ ఏడాది వాలెంటైన్స్ డే వ్యాపారం రెట్టింపు అయ్యింది. యువత తమ భాగస్వాములకు ఇచ్చే బహుమతుల విషయంలో వెనకాడకుండా ఖర్చు చేశారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి 7 నుంచి 14వ తేదీ వరకు సాగిన ఈ వాలెంటైన్ వీక్‌లో సెక్సువల్ వెల్‌నెస్ కేటగిరీలో ఊహించని అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కండోమ్స్, ఇతర పర్సనల్ వెల్‌నెస్ ఐటమ్స్ ఆర్డర్లు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఈ అమ్మకాల్లో సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మెట్రో నగరాల్లో యువత తమ వ్యక్తిగత జాగ్రత్తల పట్ల, ప్లానింగ్ పట్ల ఎంత స్పృహతో ఉన్నారో ఈ డేటా కళ్లకు కడుతోంది.
వాలెంటైన్స్ డే రోజున చాక్లెట్ల అమ్మకాలు పీక్స్‌కు చేరాయి. ఫిబ్రవరి 14న ఉదయం 11:59 గంటల సమయంలో ఇన్‌స్టామార్ట్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రతి నిమిషానికి సగటున 1,042 ఆర్డర్లు నమోదయ్యాయి. ఇది వాలెంటైన్స్ డే చరిత్రలోనే అత్యధికం. ముఖ్యంగా హార్ట్ షేప్ చాక్లెట్ల కోసం సెర్చ్‌లు గత వారంతో పోలిస్తే 500% పెరిగాయి. డార్క్ చాక్లెట్, సిల్క్ మరియు నట్ వెరైటీలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో ఒక కస్టమర్ ఏకంగా రూ.25,000 విలువైన ప్రీమియం చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్‌లను ఆర్డర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రేమను వ్యక్తపరచడానికి వాడే గులాబీ పువ్వుల కోసం సెర్చ్‌లు సాధారణ రోజుల కంటే 10 రెట్లు పెరిగాయి. ఇక టెడ్డీ డే రోజున సాఫ్ట్ టాయ్స్ ఆర్డర్లు ఏకంగా 568% పెరగడం విశేషం. చాలా మంది చాక్లెట్లు, కేకులు మరియు టెడ్డీ బేర్లను కలిపి కాంబో ప్యాక్‌లా ఆర్డర్ చేశారు. కేవలం గిఫ్ట్‌లకే పరిమితం కాకుండా బ్యూటీ, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్‌పై కూడా జనం బాగానే ఖర్చు చేశారు. కటక్‌లో ఒక కస్టమర్ రూ.15,000 విలువైన మేకప్ కిట్‌ను ఆర్డర్ చేయగా.. సూరత్‌లో మరొకరు రాత్రి 12 గంటలకే పదివేల రూపాయల విలువైన బాడీ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేశారు.
ఈ ఏడాది డేటా చూస్తుంటే ప్రజలు ముందస్తుగా గిఫ్ట్‌లు కొని పెట్టుకోవడం కంటే.. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో డెలివరీ ఇచ్చే యాప్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. చిన్న గిఫ్ట్‌లే కాకుండా వేల రూపాయల విలువైన లగ్జరీ గిఫ్ట్ బాక్స్‌లను కూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో గిఫ్టింగ్ వాల్యూమ్ పెరగడం వెనుక ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ప్రధాన పాత్ర పోషించాయి. మొత్తానికి 2026 వాలెంటైన్స్ వీక్ వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
