UPI : యూపీఐ ద్వారా రాంగ్ అడ్రస్‌కు డబ్బులు పంపారా? మీ మనీ తిరిగి పొందే ప్లాన్ ఇదే.

UPI : యూపీఐ ద్వారా రాంగ్ అడ్రస్‌కు డబ్బులు పంపారా? మీ మనీ తిరిగి పొందే ప్లాన్ ఇదే.
X

UPI : డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కోసారి నంబర్ తప్పుగా కొట్టడం వల్లనో లేక యూపీఐ ఐడీ పొరపాటు వల్లనో మనీ వేరే వారికి వెళ్లిపోతాయి. ఇలా జరిగినప్పుడు మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే.. మీరు ఏ యాప్ (Google Pay, PhonePe, Paytm, BHIM) ద్వారా మనీ పంపారో, ఆ యాప్‌లోనే Help లేదా Support సెక్షన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. అక్కడ Report a Problem ఆప్షన్ ఎంచుకుని, ట్రాన్సాక్షన్ ఐడీ, తేదీ, పంపిన అమౌంట్ వంటి వివరాలతో రిపోర్ట్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఎన్‌పీసీఐ ద్వారా రీఫండ్ రిక్వెస్ట్ పంపే అవకాశం ఉంటుంది.

ఒకవేళ యాప్ ద్వారా మీకు సరైన స్పందన రాకపోతే, వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి లేదా నేరుగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. పొరపాటున డబ్బులు ఎవరికి వెళ్లాయో ఆ వివరాలను బ్యాంకు వారికి అందజేస్తే, వారు అవతలి వ్యక్తి బ్యాంకుతో మాట్లాడి ఆ ట్రాన్సాక్షన్‌ను వెనక్కి మళ్లించే ప్రక్రియను ప్రారంభిస్తారు. గుర్తుంచుకోండి, డబ్బు పంపిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇస్తే రీఫండ్ వచ్చే అవకాశాలు 90 శాతం వరకు ఉంటాయి.

యూపీఐ వ్యవస్థను పర్యవేక్షించే ఎన్‌పీసీఐ వెబ్‌సైట్‌లో కూడా మీరు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వెబ్‌సైట్‌లోని Dispute Redressal Mechanism విభాగంలోకి వెళ్లి, మీ ట్రాన్సాక్షన్ ఐడీ, యూటీఆర్ నంబర్ వంటి వివరాలతో ఫామ్ నింపాలి. లేదా 1800-120-1740 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మీ సమస్యను వివరించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తప్పు జరిగిన 24 నుంచి 48 గంటల లోపు ఫిర్యాదు చేయడం చాలా కీలకం.

డబ్బులు పంపే ముందు ఎప్పుడైనా సరే అవతలి వ్యక్తి పేరు, యూపీఐ ఐడీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ పొరపాటు జరిగితే కంగారు పడి సమయాన్ని వృథా చేయకుండా.. వెంటనే యాప్, బ్యాంక్ లేదా ఎన్‌పీసీఐని సంప్రదించాలి. డిజిటల్ పేమెంట్లలో వేగంతో పాటు అప్రమత్తత కూడా చాలా అవసరమని గుర్తుంచుకోండి.

Tags

Next Story