Zomato : జొమాటో షాకింగ్ నిర్ణయం.. ప్రతి నెలా 5,000 మంది అవుట్.

Zomato : జొమాటో షాకింగ్ నిర్ణయం.. ప్రతి నెలా 5,000 మంది అవుట్.
X

Zomato : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో నుంచి వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల గిగ్ వర్కర్లు తమ సమస్యలపై సమ్మె చేసిన నేపథ్యంలో.. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రతి నెలా వేల సంఖ్యలో వర్కర్లను తాము తొలగిస్తున్నామని, అంతకంటే ఎక్కువ మంది తమంతట తామే పని మానేస్తున్నారని ఆయన వెల్లడించారు. అసలు జొమాటోలో ఏం జరుగుతోంది? ఎందుకు ఇంతమంది వర్కర్లు బయటకు వెళ్తున్నారు? అనే వివరాలు చూద్దాం.

ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన దీపిందర్ గోయల్.. జొమాటో ప్రతి నెలా సుమారు 5,000 మంది డెలివరీ పార్ట్‌నర్లను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తుందని తెలిపారు. అయితే ఇదంతా ఏదో కావాలని చేస్తున్నది కాదని, ప్రధానంగా మోసాలకు పాల్పడుతున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కొంతమంది డెలివరీ బాయ్స్ ఆర్డర్ కస్టమర్‌కు చేరకముందే యాప్‌లో డెలివరీ సక్సెస్ అని చూపిస్తున్నారని, మరికొందరు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లలో చిల్లర విషయంలో కస్టమర్లను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయట. ఇలాంటి క్రమశిక్షణారాహిత్య చర్యల వల్లే కంపెనీ వారిని పక్కన పెడుతోంది.

కేవలం కంపెనీ తొలగించడమే కాదు, ప్రతి నెలా సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది వర్కర్లు జొమాటో ప్లాట్‌ఫామ్‌ను స్వచ్ఛందంగా వదిలి వెళ్తున్నారు. దీనికి గల కారణాన్ని కూడా గోయల్ వివరించారు. చాలామంది డెలివరీ పార్ట్‌నర్ ఉద్యోగాన్ని ఒక శాశ్వత కెరీర్‌గా భావించడం లేదట. కేవలం తాత్కాలిక అవసరాల కోసం, తక్షణ ఆదాయం కోసం మాత్రమే ఈ పనిలో చేరుతున్నారు. తమ ఆర్థిక అవసరాలు తీరగానే లేదా అంతకంటే మంచి పని దొరకగానే ప్లాట్‌ఫామ్ వదిలేస్తున్నారు. అందుకే ప్రతి నెలా ఎంతమంది కొత్తగా వస్తారు, ఎంతమంది వెళ్తారు అనేది అంచనా వేయడం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది.

వర్కర్ల సమస్యలు ఒక పక్క ఉన్నా, వ్యాపార పరంగా జొమాటో దూసుకుపోతోంది. ఒకప్పుడు ఫుడ్ డెలివరీ మాత్రమే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. కానీ ఇప్పుడు బ్లింకిట్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ రెవెన్యూ పరంగా జొమాటోను దాటేసింది. అయినప్పటికీ, కంపెనీకి అత్యధిక లాభాలను తెచ్చిపెడుతున్న విభాగం మాత్రం ఇప్పటికీ ఫుడ్ డెలివరీనే. వీటితో పాటు హైపర్‌ప్యూర్ ద్వారా హోటళ్లకు గ్రోసరీ సప్లై చేయడం, డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా అవుటింగ్ బిజినెస్‌లోకి కూడా జొమాటో అడుగుపెట్టి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది.

Tags

Next Story