Zomato : జొమాటోను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు..ఫ్రీ ఫుడ్ కోసం ఏఐతో నకిలీ ఫోటోలు.

Zomato : జొమాటోను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు..ఫ్రీ ఫుడ్ కోసం ఏఐతో నకిలీ ఫోటోలు.
X

Zomato : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి, తీరా అది ఇంటికి వచ్చాక ఆహారం బాలేదు.. ఇందులో వెంట్రుకలు వచ్చాయి.. పురుగులు ఉన్నాయి అని కంప్లైంట్ ఇచ్చి డబ్బులు వెనక్కి తీసుకునే వారిని మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కొందరు కేటుగాళ్లు ఒక అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో జొమాటోనే మోసం చేస్తున్నారు. ఈ షాకింగ్ విషయాలను జొమాటో అధినేత దీపిందర్ గోయల్ స్వయంగా బయటపెట్టారు.

రాజ్ శమానీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న దీపిందర్ గోయల్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో జరుగుతున్న వింత మోసాల గురించి వివరించారు. కొందరు కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేశాక, రిఫండ్ పొందడం కోసం ఆహారంలో ఈగలు, వెంట్రుకలు లేదా గోర్లు ఉన్నట్లుగా ఏఐ టూల్స్ ఉపయోగించి ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు. అవి ఎంత రియలిస్టిక్‌గా ఉంటాయంటే.. మొదటి చూపులో గుర్తుపట్టడం అసాధ్యం. ఈ ఫోటోలను యాప్‌లో అప్‌లోడ్ చేసి, ఫుడ్ క్వాలిటీ బాలేదని కంప్లైంట్ ఇచ్చి మొబైల్ వాలెట్‌లోకి డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు.

ముఖ్యంగా కేక్‌ల విషయంలో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని గోయల్ తెలిపారు. కేక్ డెలివరీ అయ్యాక అది నలిగిపోయిందని వచ్చే ఫిర్యాదులు అకస్మాత్తుగా 5 శాతం పెరిగాయి. లోతుగా విచారిస్తే, డెలివరీలో ఏ తప్పూ లేదని, కస్టమర్లే ఏఐ ద్వారా కేక్ పాడైపోయినట్లు ఫోటోలు పంపుతున్నారని తేలింది. అసలు విషయం ఏంటంటే.. అటు రిఫండ్ తీసుకుంటూనే, ఇటు చక్కగా ఉన్న కేక్‌ను హాయిగా లాగించేస్తున్నారు. ఈ తరహా మోసాల వల్ల కంపెనీకి కోట్లలో నష్టం వాటిల్లుతోంది.

కేవలం కస్టమర్లే కాదు, డెలివరీ పార్ట్‌నర్లు కూడా కొన్నిసార్లు మోసాలకు పాల్పడుతున్నారని గోయల్ అంగీకరించారు. ఆహారాన్ని డెలివరీ చేయకుండానే యాప్‌లో డెలివర్డ్ అని మార్క్ చేసి, ఆ ఫుడ్ వారే తినేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఫ్రాడ్స్ చేస్తున్న సుమారు 5,000 మంది రైడర్లను ప్రతి నెలా విధుల్లో నుంచి తొలగిస్తున్నారు. ఇకపై ఇలాంటి మోసగాళ్లను ఏరిపారేయడానికి జొమాటో కర్మ స్కోర్ అనే కొత్త వ్యవస్థను తెచ్చింది. ఇందులో కస్టమర్ లేదా రైడర్ గత రికార్డును బట్టి వారికి స్కోర్ ఇస్తారు. తరచుగా రిఫండ్ అడిగే వారి స్కోర్ తగ్గిపోతుంది, ఫలితంగా వారి ఫిర్యాదులను కంపెనీ పట్టించుకోదు.

Tags

Next Story