Dasari Award : రేలంగి నరసింహారావుకు దాసరి పురస్కారం

Dasari Award : రేలంగి నరసింహారావుకు దాసరి పురస్కారం
X

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, దాసరి నారాయణరావులు తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయులని వక్తలు అభివర్ణించారు. మంగళవారం రవీంద్రభారతిలో సీల్‌వెల్‌ కార్పొరేషన్‌, శృతిలయ ఫౌండేషన్‌, శ్రీభారతి మ్యూజిక్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌, కృష్ణ, దాసరి నారాయణరావులకు స్వరనీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావుకు దాసరి నారాయణరావు పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్తా హాజరై పురస్కార గ్రహీత రేలంగి నరసింహారావును ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దాసరిలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీల్‌వెల్‌ అధినేత బండారు సుబ్బారావు, సీనియర్‌ జర్నలిస్టు మహ్మద్‌ రఫీ, కుసుమ భోగరాజు, రామకృష్ణ, గాయని వేమూరి మంజుల పాల్గొన్నారు. సభకు ముందు ప్రముఖ గాయని ఆమని నేతృత్వంలో నిర్వహించిన సీల్‌వెల్‌ సుస్వరాలు ప్రేక్షకుల్ని అలరించాయి. చక్కటి గీతాలాపనతో సినీ ప్రముఖులకు స్వరనీరాజనం పలికారు.

Tags

Next Story