Bhumi Pednekar : ఫీమేల్ లీడ్ ప్రాజెక్ట్ అంటేనే చిరాకు : భూమి పడ్నేకర్

బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న బ్యూటీ భూమి పడ్నేకర్. గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ఈ అమ్మడు అదరగొట్టింది. భీద్, అఫ్వా, థాంక్యూ ఫర్ కమింగ్, ది లేడీ కిల్లర్ లాంటి హిట్స్ తో ఆకట్టుకుంది. ఇటీవల రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ 'భక్షక్' తోనూ మరో విజయాన్ని అందుకుంది. లైంగిక వేధింపుల నుంచి బాలికలను రక్షించే జర్నలిస్ట్ పాత్ర లో నటించి మెప్పించింది.
తాజాగా లేడీ ఓరియేంటెడ్ సినిమాలపై ఈ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫీమేల్ లీడ్ ప్రాజెక్ట్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకున్నంత మాత్రాన ఒక సినిమా విజయం సాధించదని పేర్కొంది. తమది లేడీ ఓరియేంటెడ్ సినిమా అని దర్శక-నిర్మాతలు ప్రకటించగానే ప్రేక్షకుల దృష్టంతా దానిపై పడుతుందనుకోవడం అపోహెనని అభిప్రాయపడింది. అసలు ఫీమేల్ లీడ్ ప్రాజెక్ట్ అనే పదం వింటేనే తనకు చిరాకని చెప్పుకొచ్చింది.
జనం మంచి సినిమా కోరుకుంటారే తప్ప అందులో హీరో-హీరోయిన్ ఎవరు? ఎవరి ప్రాధాన్యత ఎంత అని ఆలోచించరని వ్యాఖ్యానించింది. అదే గనుక నిజమైతే తాను ఇంతదూరం వచ్చేదాన్ని కాదని వెల్లడించింది. అయితే కొందరు దర్శకరచయితలు తన నటన, పనితీరు నచ్చి బలమైన పాత్రలు రాయడం తన అదృష్టంగా చెప్పుకొచ్చింది. అందుకు వారికి ఎప్పుడూ రుణపడే ఉంటానని భూమి పడ్నేకర్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com