Kriti Sanon : సినీ ఇండస్ట్రీలో మార్పు రావాలి: కృతి సనన్

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారనే భావన చాలామంది దర్శకనిర్మాతల్లో ఉందని హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) అన్నారు. ఈ సినిమాలకు వెళితే తాము చెల్లించిన టికెట్‌కి సరైన న్యాయం జరగదని ప్రేక్షకులు భావిస్తారనేది సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సినీ ఇండస్ట్రీలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కృతి అన్నారు. తాను కరీనాకపూర్‌తో కలిసి నటించిన ‘క్రూ’ రూ.100కోట్లు రాబట్టిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న కృతి ‘దో పత్తి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘ఏ సినిమాకైనా కంటెంటే కింగ్. నేను దాన్నే నమ్ముతాను. ఏదైనా కథను ప్రేక్షకురాలిగా చదువుతాను. నచ్చితే ఆ సినిమాకు వెంటనే ఓకే చెబుతాను. చేసిన పాత్రలనే చేయడం నచ్చదు. విభిన్నమైన పాత్రలు, జానర్లలో నటించాలి. స్వచ్ఛమైన ప్రేమ కథలో నటించాలని ఉంది. కామెడీ చిత్రాలన్నా ఆసక్తి ఎక్కువే. కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగే సంఘటనలు కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అలాంటివి సినిమాల్లో ఉంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. నటిగా, నిర్మాతగా వాళ్లకు వినోదాన్ని పంచడమే నా లక్ష్యం’ అని కృతి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com