Mahesh babu : త్వరలో సెట్స్ పైకి మహేష్, జక్కన్న మూవీ

'బాహుబలి'తో (Baahubali) తెలుగు నిమాను జాతీయ స్థాయికి, 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ద్వారా ఆస్కార్ వరకు తీసుకెళ్లిన దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి (S.S.Rajamouli). ఆయన తాజా చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు వైరల్ అవుతున్నాయి. మహేష్ సినిమా స్క్రిప్ట్ సిద్దమైనట్టు తాజా సమాచారం. తన గత చిత్రాలకంటే ఇంకా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించే ప్రయత్నాల్లో రాజమౌళి ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
ప్రపంచ దేశాల్లోనే తెలుగు సినిమా సత్తా చాటేందుకు రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే సినిమా గురించి పూర్తి వివరాలు ప్రకటించి, షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఈ చిత్రంలో విదేశీ తారలు కూడా నటిస్తారట. దీనికి సంబంధించి ఓ క్యాస్టింగ్ ఏజెన్సీతో చర్చించినట్టు తెలిసింది. హీరోయిన్ గా మన దేశానికి చెందిన నటినే ఎంపికచేస్తారా లేక ఇతర దేశాలకు చెందినవారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా మాదిరిగానే అవసరం అనుకుంటే విదేశీ నాయికను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా హాలీవుడ్ నటుడు కూడా నటించ నున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం పీఎస్. వినోద్, వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఆర్సి. కమల్ కణ్ణన్ వ్యవహరిస్తారని వినిపిస్తోంది.
ఇప్పటి వరకు ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్తో వ్యవహరించే వారు. కానీ దాన్ని ఎస్ఎస్ఆర్ఎంబీ అనే వర్కింగ్ టైటిల్గా ఖరారు చేసినట్టు చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా టైటిల్ ఏమిటనే దానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా వ్యవహరించే విధంగా టైటిల్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా చిత్రీకరణ దట్టమైన అడవుల్లో జరుగుతుందనేది మాత్రం నిజం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com