Pusha 2 Release Tragedy : పుష్ప-2 రిలీజ్.. తొక్కిసలాటలో తల్లి మృతి.. కొడుకు, బిడ్డకు సీరియస్

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ లో 'పుష్ప2' ప్రీమియర్ షో నేపథ్యంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో ఈ సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో.. ఆయన్ను చూసేందుకు వేలాదిగా జనం ఎగబడ్డారు. ప్రీమియర్ షో టికెట్లు ఉన్నవారిని లోపలికి పంపాలన్న ఉద్దేశంతో గేట్లు తెరిచిన సందర్భంలో తీవ్రమైన తొక్కిసలాట, తోపులాట జరిగాయి. టికెట్లు ఉన్నవాళ్లు, లేనివాళ్లూ అందరూ థియేటర్ లోపలికి దూసుకొచ్చారు. ఈ సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపల... ఓ పది మంది కిందపడిపోయారు.
ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తోసుకుంటూ రావడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి (39), ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్, ఏడేళ్ల కూతురు కిందపడిపోయారు. జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. తీవ్ర గాయాలతో తల్లి, కొడుకు స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీతేజ్ ను పోలీసులు నిమ్స్ కు తరలించారు.
దిల్ సుఖ్ నగర్ లో తన భర్త, కొడుకు, కూతురుతో ఉంటున్న రేవతి.. పుష్ప 2 కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. కొన్ని నిమిషాల్లో సినిమా హాల్ లోకి వెళ్తామనగా జరిగిన తొక్కిసలాట ఆమె ప్రాణం తీసింది. ఆమె కుమారుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో మరో పది మంది వరకు గాయపడ్డారు. చిక్కడపల్లి పోలీసులు దీనిపై కేసు రిజిస్టర్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com