Ramoji Rao : అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ( Ramoji Rao ) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
గుండె సంబంధిత సమస్యలతో జూన్ 5వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు రామోజీరావు . అక్కడ చికిత్స పొందుతూ జూన్ 8వ తేదీ శనివారం ఉదయం 04 : 50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.
రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com