Supreme Court : కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు

కన్నడ నటుడు దర్శన్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దర్శన్‌తో పాటు ఆయన స్నేహితురాలు పవిత్రా గౌడ, మరో 15 మంది అభిమానులు రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపినందుకు రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్శన్‌ను జూన్ 11, 2025న అరెస్టు చేశారు. అనంతరం దర్శన్‌కు, మరో ఆరుగురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని రేణుకాస్వామి కుటుంబసభ్యులు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. విచారణ జరిపిన సుప్రీం కోర్టు, హైకోర్టు ఉత్తర్వులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ కేసులో సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలను సరిగా పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్ ఇచ్చిందని పేర్కొంది. "ఎంత పెద్ద వ్యక్తి అయినా చట్టానికి అతీతుడు కాదు" అని సుప్రీం కోర్టు పేర్కొంది. బెయిల్ మంజూరు చేయడం ద్వారా హైకోర్టు తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో దర్శన్‌తో సహా ఇతర నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com