Tollywood : టాలీవుడ్‌లో విషాదం... దాసి సుదర్శన్ కన్నుమూత

టాలీవుడ్‌లో (Tollywood) విషాదం నెలకొంది. ప్రముఖ చిత్రకారుడు, కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ (Sudarshan) తుదిశ్వాస విడిచారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని తన స్వగృహంలో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సుదర్శన్ మృతి చెందారు. సుదర్శన్ మృతి పట్ల పలువురు కవులు, కళాకారులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సుదర్శన్ చిత్రకళ, సాహితీరంగంలో విశేష సేవలందించారు. నాగార్జునసాగర్ జూనియర్ కళాశాలలో డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేసిన ఆయన ఎంతోమంది విద్యార్థులను కళలు, సాహిత్యంవైపు మళ్లించారు.. సాహితివేత్తగానే కాకుండా సినీరంగంలోనూ రాణించారు. ప్రముఖ సినీ దర్శకుడు నర్సింగరావుతో కలిసి పలుచిత్రాల్లో పనిచేశారు.
నర్సింగరావు దర్శకత్వంలో 1988లో విడుదలైన దాసి సినిమాకు ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. జాతీయ అవార్డు జ్యూరీలోనూ సభ్యుడిగా పనిచేశారు. మంగళవారం మిర్యాలగూడలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com