TG : సీఎం ఓఎస్డీ పేరిట చీటింగ్.. మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఏపీకి చెందిన మాజీ రంజీ క్రికెటర్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఎం ఓఎస్టీగా చెప్పు కుంటూ అధికారులు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ నాగరాజుపై తెలుగు రాష్ట్రాల లో 30 కేసులున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో వెలుగుచూసిందని, ముఖ్యంగా తాను సీఎం ఓఎస్టీ అని చెప్పుకుంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మెన్లకు సైతం వాట్సాప్ మెసేజెస్ చేశాడని పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీకాకుళంలో నాగరాజును అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా నాగరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడి అరెస్టయ్యాడని, ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో కూడా ఆయన ఫొటోలను డీపీలుగా పెట్టుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 2014 నుంచి 2016 వరకు శ్రీకాకుళం తరఫున రంజీ మ్యాచ్లు ఆడిన నాగరాజు తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్లు చెప్పి పలు కార్పొరేట్ కంపెనీలను మోసం చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com