Maoists : మావోయిస్టుల మందుపాతరకు వ్యక్తి బలి

పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి వంటచెరుకు కోసం అడవిలోకి వెళ్లిన ఓ వ్యక్తి చనిపోయాడు. ములుగు జిల్లా వాజేడు మండలం దూలాపురం రేంజ్ పరిధిలోని కొంగాల గుట్టపై సోమవారం ఈ ఘటన జరిగింది. జగన్నాథపురం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు నాలుగు ఎడ్ల బండ్లు కట్టుకొని వంటచెరుకు(కట్టెలు) కోసం అడవిలోకి వెళ్లారు. తండ్రీ కొడుకులైన ఇల్లందుల యేసు, ఇల్లందుల రమేశ్, ఇల్లందుల ఫకీర్, ఇల్లెందుల ఫాల్గుణతో పాటు అరికిల్ల లక్ష్మయ్య ఎండు కట్టెలు సేకరించడానికి కొంగల గుట్టపైకి వెళ్లారు. వీరు అడవిలో ఎండుకట్టెలు సేకరించి అమ్ముకోవడంతో పాటు కూలి పనులు చేసుకుంటూ బతుకుతారు. అందరికంటే ముందు నడుస్తున్న ఇల్లందుల యేసు(50) మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ ట్రిగ్గర్‌పై కాలు వేయడంతో అది పేలింది. పేలుడు ధాటికి యేసు సుమారు 50 అడుగుల ఎత్తు ఎగిరి బండరాళ్లపై పడిపోయాడు.
ఇది చూసిన మిగతా వాళ్లు భయంతో చాలా దూరం పరిగెత్తారు. కొంత సేపటి తర్వాత వచ్చి చూసే సరికి తీవ్రంగా గాయపడిన యేసు చనిపోయి కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తెలంగాణ-–ఛత్తీస్గఢ్సరిహద్దు అటవీ ప్రాంతం వాజేడు, వెంకటాపురం మండలాల నుంచి కూంబింగ్‌కు వెళ్లే తెలంగాణ పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతర అమర్చారని ప్రచారం జరుగుతోంది. యేసు కుటుంబాన్ని ములుగు ఎస్పీ శబరీశ్ పరామర్శించారు. ఏటూరునాగారం దవాఖానలో మృతదేహాన్ని పరిశీలించారు. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టులకు సరైన గుణపాఠం చెప్పాలని, వారికి ఎవరూ ఆశ్రయం ఇవ్వద్దని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com