TS : రైతు కుదవపెట్టిన డబ్బును ఎత్తుకెళ్లిన దుండగులు

పెట్టుబడి కోసం బంగారం బ్యాంక్ లో కుదవపెట్టిన డబ్బును తీసుకెళ్తున్న రైతును అటెన్షన్ డైవర్షన్ చేసి రూ. 14.75లక్షలను దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ కు చెందిన ఎలకొండ మల్లారెడ్డి(42) అనే రైతు పెట్టుబడితో పాటు తన కుటుంభ అవసరాల కోసం 22తులాల బంగారం వనస్థలిపురం లోని బ్యాంకు ఆఫ్ బరోడాలో కుదవపెట్టి రూ. 14.75లక్షలు తీసుకొని బ్యాగులో పెట్టుకున్నాడు. బ్యాంకు వద్ద తన కారులో ఆ నగదు ఉన్న బ్యాగును పెట్టి ఎన్జిఓస్ కాలనీ మీదుగా నాదర్ గుల్ వైపు వెళ్తున్నాడు. ఎన్జిఓస్ కాలనీ సమీపానికి రాగానే బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కారు పంక్షర్ అయ్యిందని చెప్పారు. అక్కడి నుండి సమీపంలో ఉన్న పంక్షర్ షాపు వరకు మల్లారెడ్డితో పాటు వెళ్లారు. అక్కడ ఒకరు డైవర్ట్ చేసేందుకు అతనితో మాట్లాడుతుండగా మరో వ్యక్తి కారులో ఉన్న బ్యాగ్ ను తీసుకొని ఇద్దరు కలిసి అక్కడి నుండి పరార్ అయ్యారు. కొద్ది సేపటి తర్వాత కారులో బ్యాగ్ లేదని గుర్తించిన బాధితుడు మల్లారెడ్డి తేరుకొని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.పక్క ప్రణాలిక ప్రకారం రెక్కి నిర్వహించి కారు టైరు పంక్షర్ చేసి ఈ చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఏసీపీ కాశీరెడ్డి పరిశీలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com