Dogs Attack : రెండేళ్ల బాలుడిపై కుక్కులు దాడి.. రేవంత్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో వీధి కుక్కలు దాడి చేసి రెండేళ్ల బాలుడిని చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పసి కందులు, చిన్నారులపై ప్రతి ఏటా వీధి కుక్కల దాడులకు వాతావరణ పరిస్థితులా, లేక సీజనల్ కారణాల అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి కుక్కలకు టీకాలు వేయటం, లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కలు దాడులు చేస్తే తక్షణం అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యా రోగ్య శాఖను సీఎం ఆదేశించారు.
ఇలాంటి సంఘటనలను నివారించడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com