Suicide : ప్రియురాలితో మనస్పర్థలు... ప్రియుడి ఆత్మహత్య

ప్రేమించిన యువతితో మనస్పర్థల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు చెందిన ఇమ్రోజ్ పటేల్ (28) సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. అతడు రాజేంద్రనగర్ సర్కిల్‌లోని పరమారెడ్డి హిల్స్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతడికి అత్తాపూర్‌కు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు.
ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇమ్రోజ్ పటేల్ ఎవరితో మాట్లాడినా అనుమానిస్తుండేది. బుధవారం ఇమ్రోజ్‌పటేల్ ఆమెకు ఫోన్ చేయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన ఇమ్రోజ్ పటేల్ తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కాంతారెడ్డినగర్‌లో ఉంటున్న స్నేహితుడు కృష్ణకాంత్‌కు పోన్‌చేసి ఆ యువతి విషయం చెప్పింది.
ఒకసారి ఇమ్రోజ్ ఇంటికి వెళ్లి చూడమని చెప్పడంతో అతడు ఇమ్రోజ్ ఇంటికి వెళ్లాడు. అప్పటికే అతడు లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. కృష్ణకాంత్ గట్టిగా డోర్‌ను తోయడంతో తెరుచుకుంది. లోపలకు వెళ్లి చూడగా ఇమ్రోజ్ ప్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహకారంతో కృష్ణకాంత్ రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించి ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇమ్రోజ్ సోదరుడు సాజిద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మౌనిక తెలిపారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com