West Bengal : కాంగ్రెస్ నేత దారుణ హత్య .. పశ్చిమ బెంగాల్‌లో ఘటన

కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనపై బాంబులు విసిరి చంపేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్టా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్టా జిల్లాలోని గోపాల్ పూర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ సైఫుద్దీన్ ఆదివారం ఉదయం ధరంపూర్‌లోని తన ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ముసుగులతో వచ్చిన ఐదుగురు దుండగులు సైఫుద్దీన్‌పై బాంబులు వేయడంతో పాటు పలు మార్లు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు నాసిర్ ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. మాణిక్‌చక్ రాష్ట్ర రహదారిని దిగ్బంధించి టైర్లను తగులబెట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com