Blood Bank : మీరేం మనుషులురా..! ప్లాస్మాతో వ్యాపారం.. బ్లడ్ బ్యాంకుల లైసెన్స్ సీజ్

ఈజీ మనీ కోసం మనిషి మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలబెట్టే రక్తంలోని ప్లాస్మాను కల్తీ చేసి తెగనమ్ముకుంటున్నారు. మానవ ప్లాస్మాను అక్రమంగా విక్రయిస్తున్న హైదరాబాద్‌లోని రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది.
ఫిబ్రవరి 2న మూసాపేటలో అక్రమ ప్లాస్మా సేకరణ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. మియాపూర్‌లోని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ సెంటర్, దార్ - ఉల్- షిపాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ లైసెన్స్‌లను రద్దు చేసినట్లు అధికారులు ఫిబ్రవరి 19 సోమవారం తెలిపారు.
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని నివాస భవనంలో ఉన్న హేమో సర్వీస్ లేబొరేటరీస్‌పై దాడులు నిర్వహించారు. ఫ్రీజర్‌లలో నిల్వ చేసిన మానవ ప్లాస్మా బ్యాగ్‌ల భారీ స్టాక్‌ను వారు గుర్తించారు. ఆర్. రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో హేమో సర్వీస్ లాబొరేటరీస్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. అక్రమంగా వివిధ బ్లడ్ బ్యాంక్‌ల నుండి ప్లాస్మాను సేకరించి, అనధికారిక పద్ధతిలో అమ్మకానికి నిల్వ ఉంచాడు. శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ నిబంధనలకు విరుద్ధంగా హేమో సర్వీస్ లేబొరేటరీస్‌కు చెందిన ఆర్. రాఘవేంద్ర నాయక్‌కు ప్లాస్మాను అక్రమంగా విక్రయించినట్లు డీసీఏ అధికారులు గుర్తించారు. డీసీఏ అధికారులు వెంటనే హైదరాబాద్‌లోని రెండు బ్లడ్ బ్యాంక్‌లపై దాడి చేసి, ధృవీకరణ తర్వాత హేమో సర్వీస్ ల్యాబొరేటరీలకు ప్లాస్మాను అక్రమంగా విక్రయించినట్లు నిర్ధారించారు. ప్లాస్మా అక్రమ విక్రయాలు ప్రజారోగ్యంపై దుష్ప్రభావాలకు దారితీస్తాయని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లను తక్షణమే రద్దు చేసినట్లు డిసిఎ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com