Tragic Accident : చెట్టు రూపంలో కబళించిన మృత్యువు
బొల్లారంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఉపాధ్యాయ దంపతుల్లో భర్తను చెట్టు రూపంలో మృత్యువు కబళించింది. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంజాపురం రవీందర్(54), సరళాదేవి భార్యాభర్తలు. సిద్దిపేటకు చెందిన వీరు తూంకుంటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడబిడ్డలున్నారు. సరళాదేవి 2018నుంచి బొల్లారంలోని త్రిశూల్ పార్క్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం ఇంజెక్షన్ తీసుకోవడానికి భర్త రవీందర్‌తో కలిసి స్కూటర్‌పై ఆస్పత్రికి వచ్చారు.
పార్కింగ్ ప్రదేశం వద్దకు వెళ్తుండగా ఆస్పత్రి ఆవరణలో ఉన్న భారీ వృక్షం కూలి వారిపై పడింది. దీంతో రవీందర్ మృతిచెందగా సరళాదేవి తలకు తీవ్ర గాయమైంది. కాలు విరిగింది. ఆస్పత్రి సిబ్బంది, కంటోన్మెంట్ సిబ్బంది చెట్టును తొలగించి ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. ఆమెను, రవీందర్ మృతదేహాన్ని ఒకే అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
అయితే భర్త చనిపోయిన విషయం ఆమెకు తెలియదు. కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. ఆమె పనిచేస్తున్న పాఠశాలకు కొద్ది దూరంలోనే ఈ ఆస్పత్రి ఉంది. లోబీపీ, మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న ఆమె చికిత్సకు ఈ ఆస్పత్రికే వస్తుంటారని సహోద్యోగులు తెలిపారు. చెట్టు సుమారు 30 ఏళ్ల నాటిదని, కూలుతుందని గమనించలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. బొల్లారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com