Mumbai Airport : విమానాశ్రయంలో వీల్‌ చైర్ లేదు.. నడుస్తూనే వృద్ధుడు హఠాన్మరణం

Mumbai Airport : విమానాశ్రయంలో వీల్‌ చైర్ లేదు.. నడుస్తూనే వృద్ధుడు హఠాన్మరణం

ముంబై ఎయిర్‌పోర్టులో (Mumbai Airport) షాకింగ్ ఇన్సిడెంట్ లేట్ గా బయటకొచ్చింది. ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వృద్దుడికి వీల్‌చైర్‌ అందుబాటులో లేకుండా పోయింది. చేసేది లేక అతను నడుచుకుంటూనే ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లాడు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌ వద్దకు నడుస్తూ వెళ్లాడు. బాగా ఆయాసపడిపోయిన వృద్ధుడు అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

ఫిబ్రవరి 12న ఈ ఇన్సిడెంట్ జరిగింది. అమెరికాలోని భారత సంతతికి చెందిన వృద్ధుడు సోమవారం తన భార్యతో కలిసి ఎయిరిండియా విమానంలో న్యూయార్క్‌ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. టికెట్‌ కొనుగోలు చేసే సమయంలోనే వీల్‌చైర్‌ ప్రయాణికులుగా వారి పేర్లను నమోదు చేసుకున్నారు. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత వృద్ధ ప్రయాణికులు ఇద్దరికీ వీల్‌చైర్లు అందుబాటులో ఉంచలేదు నిర్వాహకులు. ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే వీల్‌చైర్ ఇచ్చారు. వృద్ధుడు తన భార్యను అందులో కూర్చోబెట్టి.. ఆమె వెంట నడుచుకుంటూ వెళ్లాడు. 1.5 కిలోమీటర్లు నడిచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వచ్చాడు. అప్పటికే బాగా అలసిపోయిన వృద్దుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది వృద్ధుడికి వైద్య సాయం అందించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా యాజమాన్యం ఇది దురదృష్ట సంఘటన అంటూ విచారం వ్యక్తం చేసింది. ఆరోజు ప్రయాణికుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారని.. వీల్ చెయిర్లు ఎక్కువ బుక్ అయ్యాయని తెలిపింది. వీల్ చెయిర్లు వచ్చేవరకు ఆగాలని అనౌన్స్ మెంట్ ఇచ్చినా కానీ.. వారిద్దరూ నడుచుకుంటూ వెళ్లారని తెలిపింది. మృతుడి కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది ఎయిరిండియా.

Tags

Read MoreRead Less
Next Story