Crime : లారెన్స్‌ బిష్ణోయ్‌ని చంపితే రూ.కోటి నజరానా

Crime : లారెన్స్‌ బిష్ణోయ్‌ని చంపితే రూ.కోటి నజరానా
X

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు రూ.కోటికి పైగా నజరానా ఇస్తామని క్షత్రియ కర్ణి సేన రివార్డ్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో విడుదల చేసినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన ఏ పోలీసు అధికారికైనా వారి భద్రత, కుటుంబ భవిష్యత్తు కోసం రూ.కోటికి పైగా ఇస్తాము. ఈ గ్యాంగ్‌ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌ అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మా అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వారిని వదిలేది లేదు’ అని రాజ్ షెకావత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా 2023, డిసెంబర్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అనంతరం ఆయనను తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది. అయితే, గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.

Tags

Next Story