Crime : డబ్బు కోసం యజమానిని చంపిన పనిమనిషి.. విజయవాడలో దారుణం

నమ్మి ఇంట్లో పని కల్పించిన పాపానికి యజమానిని దారుణంగా హతమార్చింది ఓ మహిళ. వృద్ధాప్యంలో తనను, తన తల్లిని చూసుకోవడానికి ఒక మనిషి కావాలని భావించిన ఇంట్లో పనుల కోసం ఒక మహిళను నియమించుకున్నారు. తమ ఇంట్లోనే ఆశ్రయమిచ్చి సొంత మనిషిలాగే చూసుకుంటూ వచ్చారు. అయితే డబ్బుకు ఆశపడిన ఆ మహిళ యజమానిని చంపి ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో పరారైంది. ఈ దారుణమైన ఘటన వెలుగులోకి ఏపీ లోని విజయవాడ లో జరిగింది.
విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు(70), తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు. ఇద్దరికీ వయస్సు ఎక్కువగా ఉండటంత ఇంట్లో పనులకు ఇబ్బందిగా మారింది. దీంతో తన తల్లికి సహాయంగా ఉండేందుకు ఓ పనిమనిషి కావాలని నిర్ణయించుకొని... అనూష అనే మహిళను పని మనిషిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అనూష ను కూడా తమ ఇంట్లోనే ఉండనిచ్చారు. తన తల్లికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని కోరాడు.
ఐతే గత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి వచ్చి చూసింది. మంచం పై అపస్మారక స్థితిలో పడి ఉన్న రామారావును చూసి ఆమె భయాందోళనకు గురయ్యారు. రామారావు పై కారం చల్లి ఉంది. ఈ క్రమంలో సరస్వతికి ఏం చేయాలో తోచకపోవడంతో.. ఆ ఇంట్లో వారితోనే ఉంటున్న పనిమనిషి అనూషను పిలిచింది. ఎంత పిలిచినా పనిమనిషి పలకకపోవడంతో అనుమానం వచ్చిన రామారావు తల్లి పక్కింటి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో బీరువా పగలకొట్టి ఉంది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పనిమనిషి అనూషనే డబ్బు కోసం రామారావును హత్య చేసి పారిపోయి ఉంటుందని ప్రాథమిక విచారణకు వచ్చారు. కాగా ఈరోజు ఉదయం అనూషను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంట్లో దొంగతనాన్ని అడ్డుకున్న రామారావును తన భర్త సహాయంతో ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా విచారణలో మరిన్ని విషయాలు తేలనున్నాయి. ఏదేమైనా వృద్ధాప్యంలో తమకు సహాయంగా ఉంటుందని నమ్మి ఆశ్రయం కల్పిస్తే ఇలా ప్రాణాలని తీయడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com