Kakinada Smugglers : కాకినాడలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు

కాకినాడ జిల్లాలో జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్త ఏడాది వేళ వాహన తనిఖీలు చేస్తుండగా కారును ఆపిన ఇద్దరు కానిస్టేబుళ్ల మీదకు బండిని తీసుకెళ్లారు ఆ ఇద్దరు స్మగ్లర్లు. ప్రస్తుతం బాధిత కానిస్టేబుల్స్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి.సతీష్, కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి సుమారు ఒంటి గంటన్నర సమయంలో విశాఖవైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కారును పోలీసులు ఆపారు. రోడ్డు పక్కకు ఆపుతున్నట్లు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు పోనిచ్చాడు. అప్పటికే ఆ వాహనం ముందు నిలుచున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ రాజి లోవరాజుతోపాటు మరో కానిస్టేబుల్‌ను కారు ఢీకొని దూసుకుపోయింది. లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. కారును రాజానగరం సమీపంలోని కెనాల్ వద్ద డ్రైవర్ వదిలి పరారయ్యాడు. వారిని పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. కారు దూసుకుపోయిన ఘటన కాకినాడ జిల్లాలో సంచలనం రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com