East Godavari: కల్లులో గడ్డిమందు కలిపి అయిదుగురిని హత్య.. గ్రామ వాలంటీరే నిందితుడు..

East Godavari: కల్లులో గడ్డిమందు కలిపి అయిదుగురిని హత్య.. గ్రామ వాలంటీరే నిందితుడు..
East Godavari: తూర్పుగోదావరి జిల్లా గిరిజన గ్రామంలో జీలుగ కల్లు తాగి ఐదుగురు మృతిచెందిన కేసును పోలీసులు ఛేదించారు.

East Godavari: తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గిరిజన గ్రామంలో జీలుగ కల్లు తాగి ఐదుగురు మృతిచెందిన కేసును పోలీసులు ఛేదించారు. కుట్రపూరితంగా కల్లులో గడ్డిమందు కలపడం వల్లే దారుణం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధం కారణంగా గొడవ జరగడంతో అదే గ్రామానికి చెందిన వంతల రాంబాబు అనే వ్యక్తిఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు తేల్చారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కల్లులో విషం కలిపినట్లు నిర్ధారణ అయ్యింది.

నిందితుడు రాంబాబు లోదొడ్డిలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఇతనికి మృతుల్లో ఒకరైన పొత్తూరి గంగరాజు భార్యతో సాన్నిహిత్యం ఉంది. దీనిపై గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. ఇది మనసులో పెట్టుకున్న నిందితుడు రాంబాబు.. గంగరాజుని అడ్డుతొలగించాలని ప్లాన్ వేశాడు. గంగరాజు తాగే కల్లులో గడ్డిమందు కలిపాడు.

దురదృష్టవశాత్తు విషపూరితమైన కల్లును మరో నలుగురు కూడా తాగడంతో వారూ మరణించారు. ఘటన జరిగిన రోజే వాలంటీరు వంతల రాంబాబు పాత్రపై అనుమానాలు వచ్చాయి. ఈకోణంలోనే పోలీసులు దర్యాప్తు సాగింది. నిందితుడు వంతల రాంబాబును అదుపులోకి తీసుకుని విచారించిడంతో విషయం బయటపడింది. అటు మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా నిలిచింది.

ఆర్థికసాయం అందించడంతో పాటు కేసును త్వరగా పరిష్కరించేలా సర్కారు, పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. ఘటనపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి నివేదికను పార్టీ కార్యాలయానికి అందజేసింది. ఈక్రమంలో టీడీపీ కమిటీ సభ్యులకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. వాస్తవాల పరిశీలనకు లోదొడ్డి వెళ్లిన టీడీపీ వాళ్లను కరోనా ఆంక్షలంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయినా టీడీపీ సభ్యులు గ్రామంలో పర్యటించి వాస్తవాలను పార్టీ అధిష్టానానికి అందజేశారు.

ఒక్కో మృతుని కుటుంబానికి యాభై వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. ఘటనకు ప్రభుత్వ వైఫల్యం కూడా కారణమే అని మండిపడ్డారు నేతలు. గిరిజన గ్రామాల్లోని ఆస్పత్రల్లో కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈనెల 2న ఘటన జరిగింది. గడ్డిమందు కలిసిన కల్లును సేవించిన ఐదుగురు గిరిజనులు నురగలు కక్కున్నారు. వెంటనే వీరిని ముందుగా జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం, ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఇద్దరు చనిపోయారు. ఏలేశ్వరం నుంచి కాకినాడ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మరో ఇద్దరు మృతిచెందారు. చివరి వ్యక్తి కాకినాడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు.

Tags

Read MoreRead Less
Next Story