Crime : విశాఖలో తల్లి, కూతురును నరికిన కిరాతకుడి కోసం గాలింపు

విశాఖ మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలితో పాటు, ఆమె తల్లిపై ప్రేమోన్మాది కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తల్లి అక్కడిక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది. దీనికి సంబం ధించి పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... విశాఖ మధురవాడ స్వయంకృషి నగర్ లో నక్కరాజు భార్య లక్ష్మి, కుమార్తె దీపికతో కలసి నివాసముంటున్నారు. దీపిక తండ్రి రాజు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కాగా అదే ప్రాంతంలో నివాసముం టున్న దమరసింగ్ నవీన్(26) డిగ్రీ చదివి ఖాళీ ఉంటున్నాడు. దీపిక, నవీన్ లు గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ వివాహానికి తొలుత ఇరు కుటుంబాలు సైతం ఒప్పుకున్నారు.
అయితే కొంతకాలంగా నవీన్ ప్రవర్తనలో మార్పు రావడంతో దీపిక కుటుంబసభ్యులు నవీన్ ను ప్రవర్తన మార్చుకోమని పదేపదే హెచ్చరించారు. అయిన ప్పటికీ నవీన్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో దీపిక తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన నవీన్, బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దీపిక ఇంటికి వెళ్లి, తనకు వివాహం చేయమని కోరాడు. దీంతో దీపిక తల్లి లక్ష్మి అంగీకరించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవీన్, అప్ప టికే తన వెంట తెచ్చుకున్న కత్తితో తీవ్రంగా ఇరువురిపై దాడి చేశాడు. ఈ దాడితో సంఘటన స్థలంలోనే తల్లి లక్ష్మి (43) అక్కడిక్కడే మృతి చెందగా, దీపిక తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు ఇదే సమాచారాన్ని పోలీసులకు అందించారు. తక్షణమే సంఘటన స్థలానికి క్రైం ఎస్ఐ భాస్కరరావు హుటాహుటిన చేరుకుని, తీవ్ర గాయాలైన దీపిక ను ఎస్.ఐ. భాస్కరరావు తన బైకుపై ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న దీపిక ప్రాణపాయం నుంచి బయట పడింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కూడా విషమంగానే ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన లక్ష్మి నివాసానికి విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, ఏసీపీ బంగారాజు స్వయంగా వెళ్లి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దీంతో నిందితుడుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com