Suicide : అన్నదమ్ముల మధ్య భూ పంచాయితీ.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య

అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ తగాదాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండలం ఏ బూడిదపాడులో తమ కుటుంబానికి భూమిలో వాటా ఇవ్వడం లేదని తల్లీ కూతుళ్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..ఏ బూడిదపాడు గ్రామానికి చెందిన నర్సింహులు, వీరేశు, రాముడు, లక్ష్మన్న అన్నదమ్ములు. వీరికి వారసత్వంగా పొలం వచ్చింది. వీరేశు, రాముడు, లక్ష్మన్న 4 ఎకరాల 20 గుంటల పట్టా పొలాన్ని తమ పేరిట చేయించుకున్నారు. సీలింగ్యాక్ట్ కింద ప్రభుత్వం నుంచి వచ్చిన రెండెకరాల 20 గుంటల భూమిని నరసింహులుకు ఇచ్చారు.
నరసింహులుకు భార్య వరలక్ష్మి(40), కూతురు అనురాధ (18), కొడుకు ఉన్నారు. తనకు వచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయిందని, పొలాన్ని అందరికీ సమానంగా పంచాలని నర్సింహులు కోరుతున్నాడు. ఈ విషయంపై కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత ఏడాది పెద్దల సమక్షంలో పట్టా పొలంలో వాటా ఇవ్వాలని మాట్లాడుకున్నప్పటికీ, ఇవ్వకుండా జాప్యం చేశారు. దీంతో తమకు న్యాయం జరగడం లేదని మంగళవారం సాయంత్రం ఇంట్లో నరసింహులు భార్య, కూతురు పురుగుల మందు తాగారు. గమనించి కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
బుధవారం డెడ్బాడీలను గ్రామానికి తరలిస్తుండగా మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు ఊరి సమీపంలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు సర్ధి చెప్పడానికి రాగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనడంతో వరలక్ష్మి కొడుకు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు వీరేశు, రాముడు, లక్ష్మన్నతో పాటు వారి భార్యలపై కేసు నమోదు చేశారు. భార్య, బిడ్డతో పాటు నర్సింహులు కూడా పురుగుల మందు తాగాలని నిర్ణయించుకున్నాడని, ఆ తర్వాత వెనక్కి తగ్గాడని, దీని వెనక ఏదైనా కారణం ఉందా తెలుసుకోవడానికి అతడిపై కూడా కేసు నమోదు చేసినట్టు శాంతినగర్ పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com