AP: నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలత అరెస్ట్

AP: నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలత అరెస్ట్
నోట్ల మార్పిడి కేసులో కొందర్ని బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఆర్మ్‌డ్‌ రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత అరెస్టవడం పోలీసు శాఖలో సంచలనంగా మారింది.

నోట్ల మార్పిడి కేసులో కొందర్ని బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఆర్మ్‌డ్‌ రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత అరెస్టవడం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. ఏఆర్ సీఐ స్వర్ణలతకు సినిమాలంటే పిచ్చ ఇంట్రస్ట్‌. ప్రస్తుతం ఆమె ఏపీ 31 సినిమాలో నటిస్తున్నారు.సినిమాలపై ఆసక్తి ఉన్న స్వర్ణలత కొంత కాలం క్రితం ఓ పాటకు డ్యాన్స్‌ చేసి చిరు ప్రయత్నం అంటూ ఆ వీడియోతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు.తాను తీయబోయే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని, ఇందుకు డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండాలని ఒక ప్రజాప్రతినిధి చెప్పటంతో స్వర్ణలత కొరియోగ్రాఫర్‌ను నియమించుకుని డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు.ఇందులో భాగంగానే పలు వీడియోలు తీశారు.

సినిమాల్లో అవకాశాలకు ప్రయత్నిస్తున్న క్రమంలో స్వర్ణలతకు వైసీపీ నేతలతో పరిచయాలు పెరిగాయి.గత GVMC ఎన్నికల్లో ఆమెకు బంధువైన ఓ మహిళా అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. కొన్నాళ్ల కిందట టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఏపీ పోలీసు అధికారుల సంఘ ఉపాధ్యక్షురాలి హోదాలో పంచ్‌ డైలాగ్స్‌ వేశారు. పోలీసులకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడుతున్నారంటూ ప్రెస్‌మీట్‌లో అయ్యన్నపై ఓ స్క్రిప్ట్‌ రాసుకువచ్చి చదివి వినిపించారు. ఇదంతా వైసీపీ నేతల డైరెక్షన్‌లోనే జరిగిందని ప్రచారం జరిగింది.

తాజాగా నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలతను పోలీసులు అరెస్టు చేయగా కేసు పెట్టకుండా ఆమెకు సన్నిహితుడైన ఓ కీలక ప్రజాప్రతినిధి విశ్వప్రయత్నాలు చేశారు. తన వల్ల కాదని తేలడంతో ఆయన వైసీపీ ముఖ్య నేతలను అభ్యర్థించి ఆమెపై కేసు తీవ్రతను తగ్గించేలా ఒత్తిళ్లు తెచ్చారు.ఈ నేపథ్యంలో స్వర్ణలత రాజకీయ సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం సీఐ స్వర్ణలతపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఏఆర్‌ హోంగార్డు ఎస్సైగా పనిచేస్తున్నప్పుడే హోంగార్డు నియామకాల విషయంలో ఆమెపై అనేక ఆరోపణలొచ్చాయి. తర్వాత విజయవాడ బదిలీ చేయగా, కొంత కాలం పనిచేసి శ్రీకాకుళం ఏఆర్‌కు వచ్చారు. అక్కడ పనిచేస్తుండగా జిల్లాల విభజన జరగడంతో బదిలీపై అనకాపల్లి జిల్లాకు వెళ్లారు. విశాఖలో ఖాళీ ఉండటంతో వైసీపీ నేతల సిఫార్సులతో నగరానికి వచ్చారు. కొంతకాలం సిటీ ట్రైనింగ్‌ సెంటర్‌లో పనిచేసి తర్వాత హోంగార్డుల రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. హోంగార్డుల నిర్వహణ విషయంలోనూ స్వర్ణలత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ప్రస్తుతం స్వర్ణలత నటిస్తున్న ‘ఏపీ 31’ చిత్ర నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలోనూ ఆమె భాగస్వామి అయినట్లు తెలుస్తోంది.అందుకు డబ్బుల కోసమే నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్‌ వ్యాపారులతోనూ ఆమెకు పరిచయాలున్నాయి. కమీషన్‌ తీసుకుని ఇలా నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కొన్ని ప్లాట్లు కూడా ఆమె బుక్‌ చేశారన్న ఆరోపణలున్నాయి.

Tags

Next Story